E-PAPER

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్- దీపావళి కానుక ప్రకటన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. గేరు మార్చింది. టాప్ స్పీడ్‌ను అందుకుంది. ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు భారత్ రాష్ట్ర సమితి సహా ఇతర ప్రతిపక్షాల దూకుడుకు మూకుతాడు వేయడానికి ఏకకాలంలో ప్రాధాన్యతను ఇస్తోంది.

 

మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు.. వంటి సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకెళ్తోంది కాంగ్రెస్. ఇందిరమ్మ పరిపాలనగా పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. మహిళా సాధికారత, రైతాంగం, ఉద్యోగాల కల్పన, విద్యా ప్రమాణాలను మరింత పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

 

మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించడంలో భాగంగా వారికి ప్రతినెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే- రైతు భరోసా కింద రుణమాఫీని ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్.

 

ప్రతి ఎకరాకు ఏటేటా 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక భరోసాను అందిస్తోంది. వరి పంటకు మరో 500 రూపాయలను బోనస్‌గా కూడా ప్రకటించింది. చేయూత వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు, ఎయిడ్స్ రోగులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తోంది.

 

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసింది. విద్యార్థులకు దీపావళి కానుకను ప్రకటించింది. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటోన్న వారికి శుభవార్త వినిపించింది. వారికి చెల్లించే డైట్, కాస్మటిక్ ఛార్జీలను భారీగా పెంచింది. ప్రస్తుతం చెల్లిస్తోన్న ఈ ఛార్జీలను 40 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేసింది.

 

2017 మే 23వ తేదీన చివరిసారిగా వాటి ఛార్జీలను సవరించింది తెలంగాణ ప్రభుత్వం. 3 నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటోన్న విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెలా 950, 8 నుంచి 10వ తరగతి వారికి 1,100, ఇంటర్మీడియట్ నుంచి పీజీ విద్యార్థులకు 1,500 రూపాయల మేర డైట్, కాస్మటిక్ ఛార్జీల చెల్లింపు ప్రస్తుతం అమలులో ఉంది.

 

తాజాగా ఈ ఛార్జీలను 40 శాతం వరకు పెంచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇకపై 3 నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటోన్న విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెలా 950కి బదులుగా 1,330 రూపాయలను చెల్లిస్తుంది. 8 నుంచి 10వ తరగతి వారికి చెల్లించే ఛార్జీలు 1,100 నుంచి 1,540కి పెంచింది.

 

ఇంటర్మీడియట్ నుంచి పీజీ విద్యార్థులకు చెల్లించే 1,500 రూపాయల డైట్, కాస్మటిక్ ఛార్జీలను 2,100 రూపాయలకు పెంచింది. కేటగిరీల వారీగా చూసుకుంటే 3 నుంచి 7వ తరగతి చదివే 11 సంవత్సరాల లోపు విద్యార్థినులకు చెల్లించే ఛార్జీలు 55 నుంచి 175 రూపాయలకు పెరిగినట్టయింది.

 

11 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థినుల డైట్ ఛార్జీలు 75 నుంచి 275 రూపాయలకు పెరిగింది. 11 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థులకు హెయిర్ కంటింగ్ కలుపుకొని చెల్లించే మొత్తం 62 నుంచి 150 రూపాయలు, 11 సంవత్సాలకు పైనున్న వయస్సు ఉన్న వారికి 62 నుంచి 200 రూపాయలకు డైట్ ఛార్జీ పెరిగింది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram