E-PAPER

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమికి అనుకూలత ఉందని అంచనాలు వెల్లడించాయి. ఇక, వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముందుగానే తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించింది.

ఆప్ తొలి జాబితా
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల పైన కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరిలో ఢిల్లీతో పాటుగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా జరిగిన హర్యానా ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ కనీస పోటీ ఇవ్వలేక పోయింది. అక్కడ కాంగ్రెస్ తో విభేదించి ఒంటరిగా పోటీ చేయటం ద్వారా రెండు పార్టీలు నష్టపోయాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, ఢిల్లీ ఎన్నికలే లక్ష్యంగా మాజీ సీఎం కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రచార బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ముందుగా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేసి ప్రజల మధ్యకు పంపాలని నిర్ణయించారు.

వలస నేతలకు సీట్లు
ఈ రోజు కేజ్రీవాల్ నివాసంలో పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. అందులో పార్టీ నుంచి పోటీ చేసే 11 మంది అభ్యర్ధులను ఖరారు చేసారు. ఆప్ నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సమయంలో కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. ముందుగానే అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలను సీట్లు ఖాయం చేసారు. కిరారీ నుంచి అనిల్‌ ఝా, సీమాపురి – వీర్‌సింగ్‌ ధింగన్‌లను పార్టీ బరిలోకి దింపింది. వీరితో పాటు ఛతర్‌పూర్ – బ్రహ్మ సింగ్ తన్వర్, విశ్వాస్ నగర్ – దీపక్ సింగ్లా, రోహతాస్ నగర్ – సరితా సింగ్, లక్ష్మీ నగర్ – బీబీ త్యాగి, బదర్‌పూర్ – రామ్ సింగ్ నేతాజీ పేర్లను ఆప్ ఖారారు చేసింది.

కొత్త వ్యూహాలతో
సీలంపూర్ – జుబేర్ చౌదరి, ఘోండా – గౌరవ్ శర్మ బరిలోకి దిగారు. కరావాల్ నగర్‌కు మనోజ్ త్యాగి, మటియాలా నుంచి సుమేష్ షోకీన్ ను ఎంపిక చేసింది. మొత్తం 11 మందిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి వచ్చిన ఆరుగురికి సీట్లు దక్కాయి. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మిగిలిన అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఖరారైన అభ్యర్దులు ప్రజల్లోనే ఎక్కవ సమయం ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఇక, కేజ్రీవాల్ పూర్తిగా ఎన్నికల పైనే కసరత్తు కొనసాగిస్తున్నారు. అదే విధంగా మేనిఫెస్టో గురించి పార్టీ ముఖ్య నేతలు ఫోకస్ చేసారు. ఢిల్లీలో ఎలాగైనా తిరిగి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న కేజ్రీవాల్ కాంగ్రెస్ తో తన సొంత రాష్ట్రంలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram