ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసమే ముఖాముఖీ కార్యక్రమం కి వచ్చామని తెలిపారు. ప్రలజావాణితో పాటు.. పార్టీ భావజాలం నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్య ఉండి పాలన చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని అన్నారు.
విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోందని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు 40 శాతం పెంచి అందిస్తున్నామని వెల్లడించారు. అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం రాగానే TGPSC ప్రక్షాళన చేసి 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు సరిగ్గా నిర్వహించాలేక గాలికి వదిలేశారని విమర్శించారు. BRS కుటిల ప్రయత్నాలను తట్టుకొని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీని ప్రభుత్వం కట్టనుందని చెప్పారు.
మహిళా సంఘాలతో వెయ్యి మెగా ఓల్ట్ ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. 60 ITI లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని చెప్పారు. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, కుల గణన చారిత్రాత్మక విజయమని అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ గా కుల గణన నడుస్తుందని తెలిపారు. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీ దారులు ప్రయత్నం చేస్తున్నారని, వనరులు ప్రజలకు సమానం చేస్తామని హామీ ఇచ్చారు.