భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపికపై జరుగుతున్న చర్చకు తెరపడింది. రతన్ టాటా వారసుడిగా ఆయన సవతి తల్లి కుమారుడు, సవతి సోదరుడైన నోయెల్ నావల్ టాటాను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో రతన్ టాటా వారసుడిగా నోయెల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే టాటా ట్రస్టుల్లో సభ్యుడిగా ఉన్న నోయెల్ ఇప్పుడు అత్యున్నత స్ధానంలోకి వెళ్లబోతున్నారు.
ఎవరీ నోయల్ నావెల్ టాటా ?
రతన్ టాటా తండ్రి నావెల్ టాటాకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుల్లో రతన్ టాటాతో పాటు జిమ్మీ టాటా ఉన్నారు. అలాగే రెండో భార్య సిమోన్ కుమారుడు నోయల్ నావెల్ టాటా. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ కూడా అయిన రతన్ టాటాకూ, అతని సోదరుడు జిమ్మీ టాటాకు నోయెల్ సవతి సోదరుడు అవుతారు. టాటా కుటుంబంలో కూడా ఆయన ఓ భాగం. ఇప్పటికే టాటా ట్రస్టుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తున్న నోయెల్ ను ఇప్పుడు ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
టాటా గ్రూపుతో నోయెల్ అనుబంధం
నోయల్ నావెల్ టాటాకు టాటా గ్రూపులో 40 ఏళ్లుగా పనిచేస్తున్న అనుబంధం ఉంది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అంతే కాదు వివిధ టాటా గ్రూప్ కంపెనీల బోర్డులోనూ, టైటాన్ కంపెనీ లిమిటెడ్ లోనూ పనిచేస్తున్నారు. అలాగే సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా కూడా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీగా సంస్ధ టర్నోవర్ ను 500 మిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్లకు చేర్చిన ఘనత కూడా ఉంది. అలాగే టాటా సంస్ధకు చెందిన పలు ట్రస్ట్ లలోనూ సభ్యుడిగా ఉన్నారు.