ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ప్రముఖులు, ప్రజలు భారీగా తరలివచ్చి చివరిసారిగా రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లోనుంచి రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభమై వర్లీ శ్మశాన వాటిక వరకు కొనసాగింది.
హిందూ సంప్రదాయాల ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలను నిర్వహించారు. అంతకంటే ముందు వర్లీలోని విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయన్ని ఉంచి, కొద్దిసేపు ప్రార్థనలు చేశారు. అనంతరం అంత్యక్రియల ప్రక్రియను పూర్తిచేశారు.
రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఈ కమ్యూనిటీలో అంత్యక్రియల ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. ఇతర ఏదైనా కమ్యూనిటీలో ఎవరైనా మృతిచెందితే కాల్చివేయడమో లేదా పూడ్చివేయడమో చేస్తారు. కానీ, ఈ పార్సీ కమ్యూనిటీలో అంత్రయక్రియల ప్రక్రియ ఇందుకు భిన్నంగా ఉంటుంది. పార్సీ అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో ఎవరైనా మృతిచెందితే వారి మృతదేహాన్ని రాబందులు తినేందుకు వీలుగా బహిరంగ ప్రదేశాల్లో పెడుతారు. ఈ అంత్యక్రియల పద్ధతిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని కూడా పిలుస్తారంటా. అయితే, రతన్ టాటా అంత్యక్రియలను మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.
కరోనా సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో పలు మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పార్సీ కమ్యూనిటీవారు అనుసరించే అంత్యక్రియల పద్ధతిని పలు ప్రభుత్వాలు నిషేధించాయి. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందినప్పుడు కూడా వారి అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి…
రతన్ టాటా అంత్యక్రియల కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతోపాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో హాజరై రతన్ టాటాకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు భారీగా నినాదాలు చేశారు. రతన్ టాటా అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బుధవారం రాత్రి రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని క్యాండీ బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురై.. రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా పార్థివదేహాన్ని మొదటగా ప్రజల సందర్శనార్థం ఎన్సీపీఏ గ్రౌండ్ లో ఉంచారు. ఈ సందర్భంగా రాజకీయ, వ్యాపార, సినిమాతోపాటు పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు, ప్రజలు భారీగా రతన్ టాటా పార్థిక దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి ముంబైలోని వర్లీ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి చేశారు.