E-PAPER

నేను పలావు.. బాబు బిర్యానీ.. ప్రజలపై జగన్ కౌంటర్…

ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీ (YCP) డీలా పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ మళ్లీ పూర్వ వైభవాన్ని పొందేందుకు ఇప్పటి నుండే కసరత్తు చేస్తోందా.. అంటే అవుననే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం సైలెంట్ గా ఉన్న వైసీపీ.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోగానే డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. నేడు వాటి అమలు మరచిపోయిందని వైసీపీ విమర్శిస్తోంది. కూటమి మాత్రం మన పని మనం చేసుకుంటూ పోవడమే.. అనే ధోరణిలో పరిపాలన కొనసాగిస్తోంది.

 

అయితే ఇటీవల కూటమి లక్ష్యంగా మాజీ సీఎం జగన్ (JAGAN) విమర్శలు చేస్తూనే.. తన పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా జిల్లాల నేతలతో సమావేశమవుతూ.. పార్టీ కష్టకాలంలో ఉంది.. ఇప్పుడు వెంట ఉన్న ఏ నాయకుడికి, కార్యకర్తకు అన్యాయం జరగనివ్వను. నేను గుడ్ బుక్ రాస్తున్నా.. అందులో మీ పేరు ఉండేలా చేసుకోండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని తన నివాసంలో జరిగిన నాయకుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు కానీ.. రెడ్ బుక్ పరిపాలన పెద్దపనేమి కాదని, తాను గుడ్ బుక్ మొదలుపెట్టానన్నారు.

 

వైసీపీ (YCP) పరిపాలన సమయంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాం.. కానీ ఏనాడు హామీలను విస్మరించలేదన్నారు. కానీ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇష్టారీతిన హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చి.. ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అలాగే పలావు, బిర్యానీ లతో తన పాలన గురించి వివరిస్తూ.. తాను పలావు పెడితే ప్రజలు రుచి చూశారని, కానీ కూటమి బిర్యానీ పెడుతుందని ప్రజలు ఆశించారన్నారు. ఇప్పుడు పలావు లేదు.. బిర్యానీ లేదు.. ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు.

 

ఈ ఐదేళ్లు ప్రతి నాయకుడు కష్టపడాలి. గ్రామ స్థాయి నుండి బూత్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని జగన్ (YS JAGAN) కోరారు. పార్టీ సంస్థాగత నిర్మాణం బలంగా ఉండాలని, అప్పుడే రాబోయే ఎన్నికలకు సిద్దమైనట్లుగా భావించాలన్నారు. అధికారం కష్టాలకు భయపడేది లేదని, కావాలంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు అంతేగా.. తాను 16 నెలలు జైలులో ఉన్నట్లు తెలిపారు. ఇలా తన పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు జగన్ ప్రసంగం.. భిన్నరీతిలో సాగిందని చెప్పవచ్చు. అసలు ఈ సమావేశం ద్వారా.. తన పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంతో పాటు.. పార్టీని బలోపేతం దిశగా ఇప్పటి నుండే ప్రణాళికను వైసీపీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కూటమి మాత్రం తాము ఇచ్చిన ప్రతి హామీని అమలుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందడుగు వేస్తోంది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram