దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
సోమవారం రతన్ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు.
1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. అనంతరంలో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.
రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు..
తొలుత టాటా స్టీల్‌లో చేరిన రతన్ టాటా.. అనంతరం గ్రూప్‌ను అంచెలంచెలుగా ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ, దిశ చూపించారు. దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన ఆయన.. టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. తన సంపదలో 60-65 శాతం దాతృత్వానికే కేటాయించారు.
బిజినెస్ టైకూన్‌గా పేరున్న రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను రెండు దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. ఇక వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసమాన్యమైనది. 2000లో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన.. ప్రపంచంలోనే ‘టీ’ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్‌ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. ఇక టాటా మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఇండికా కారును 1998లో రతన్ టాటా మార్కెట్‌కు పరిచయం చేశారు. దీంతో భారత వాహన రంగంలో సెన్సేషనల్‌గా మారింది.
దాతృత్వంలో రతన్ టాటాకు సాటిరారు..
కొవిడ్ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం రూ. 1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. ‘‘అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో కొవిడ్-19పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్టు కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికీ పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం” అని రతన్ టాటా తన ప్రకటనలో స్పష్టంచేశారు.
భారత్ ఒక దిగ్గజ వ్యాపార వేత్తను కోల్పోయింది: రాష్ట్రపతి
రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ‘‘భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు.
సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి
రతన్ టాటా మరణం పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంతాపం తెలిపారు. ‘‘అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారు’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
రతన్ టాటా దయగల అసాధారణ వ్యక్తి: ప్రధాని మోదీ
రతన్ టాటా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’’అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని కొనియాడారు.
వ్యాపారం.. దాతృత్వంలో శాశ్వత ముద్ర: రాహుల్ గాంధీ
రతన్ టాటా మరణం పట్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిజమైన మానవతావాదిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు
రతన్ టాటా మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్రవేసిన కొందరు వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరు. మనం ఒక వ్యాపారవేత్తనే కాదు.. నిజమైన మానవతావాదిని కోల్పోయాం. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్ టాటాను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌నకు తన ప్రగాఢ సానుభూతి’’ అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
‘‘భారతదేశం అమూల్యమైన కుమారుడిని కోల్పోయింది. ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. దేశ నిర్మాణానికి రతన్ టాటా ఎంతో సహకారం అందించారు’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
రతన్ టాటా మరణం పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అసాధారణమైన సేవలు అందించినట్లు పేర్కొన్నారు.