E-PAPER

హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీనే..!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హర్యానా ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడో సారి భారతీయ జనతాపార్టీ విజయం కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సీనియర్‌ నాయకులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి, నయాబ్‌ సింగ్‌ షైనీని ఆ స్థానంలో కూర్చోబెట్టిన మోదీ-షా ద్వయం వ్యూహాలు ఫలించాయి. దీంతో హర్యానాలో కమలం పార్టీ హ్యాట్రిక్‌ విజయం కైవసం చేసుకోవడానికి దోహదం చేసింది.

 

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. కాగా, మ్యాజిక్ ఫీగర్ 46 సీట్లును బీజేపీ క్రాస్ అయింది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 49, కాంగ్రెస్ పార్టీ 36 చోట్ల గెలిచింది. ఇతరులు 5 స్థానాల్లో గెలిచారు. ఐఎన్ఎల్డీ, ఇతరులను కలుపుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు పక్క రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్‌ లో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ పూర్తిగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఈ ఒక్కరూ కూడా కనీసం పోటీ చూపకపోవడం గమనార్హం.

 

హర్యానా ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. అయితే సీఎం ఎవరనేదానిపై ఇంకా స్పష్టత కొరవడింది. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సీఎం షైనీ ప్రకటించగా.. ఈ సారి కూడా నాయబ్‌ సింగ్‌ సైనీనే హర్యానా సీఎంగా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

 

అయితే ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందనుకున్న జాట్ల ఆందోళన, నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల అందోళన, ఢిల్లీలో స్టార్‌ రెజర్లు వినేష్‌ ఫొగాట్‌, భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ సహా పలువురు రెజర్లు చేపట్టిన నిరసన దీక్ష అగ్నివీర్‌ ఎంపికలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు అన్నీ ఓటర్లపై ప్రభావం చూపలేక పోయాయి.

 

ఎన్నికలకు దాదాపు 200 రోజుల ముందు సైనీని అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. అందులో భాగంగానే అధికార వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టే వ్యూహాత్మక ఎన్నికలకు ముందు పునర్వ్యవస్థీకరణ చేశారు. ఇందులో భాగంగానే మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి, నయాబ్‌ సింగ్‌ షైనీని ఆ స్థానంలో కూర్చోబెట్టారు.

 

నయాబ్‌ సింగ్‌ సైనీ.. మాజీ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2014లో నారాయణ్‌గఢ్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందగా.. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సైనీ.. సీఎంగా పగ్గాలు స్వీకరించారు. తాజాగా, మళ్లీ ఆయనే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram