E-PAPER

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేళ.. కేంద్రమంత్రితో చంద్రబాబు భేటీ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా ఉంటోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం అంశాలపై మాట్లాడారు.

 

చంద్రబాబు కలిసిన వారిలో హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, రోడ్లు- ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, పోలవరానికి 2,800 కోట్ల రూపాయల నిధులు, రాష్ట్రానికి కొత్తగా జాతీయ రహదారుల మంజూరు వంటి అంశాలపై వారితో చర్చించారు.

 

అదే సమయంలో ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామితోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో చంద్రబాబు వెంట కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, లోక్‌సభ సభ్యులు భరత్, లావు కృష్ణదేవరాయలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఉన్నారు.

 

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుమారస్వామితో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్టీల్ ఫ్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేశారు.

 

సెయిల్‌లో విలీనం కావడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్.. నేరుగా కేంద్ర ప్రభుత్వపరమౌతుంది. భిలాయ్, బొకారొ, దుర్గాపూర్, రూర్కేలా, అసన్‌సోల్ వంటి స్టీల్ ప్లాంట్లు సెయిల్ ఆధీనంలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి. అవన్నీ కూడా నేరుగా కేంద్రం ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.

 

అదే తరహాలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా విలీనం చేయాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి గల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవంక- విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.

 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

 

మిత్రపక్షాల సహకారంతో ఏపీలో తామే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయ ప్రయత్నాల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. శరవేగంగా ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది.

 

ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram