ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న దరఖాస్తు దారులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. దీని పైన ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనర్హులకు కార్డు తెలిగిస్తూనే..గతంలో అర్హత ఉన్నా కార్డు రద్దయిన వారికి పునరుద్ధరించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన తుది కసరత్తు చేస్తోంది. రేపు (గురువారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. గత ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరి, జూన్ లో కొత్త కార్డులను మంజూరు చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తమకు కొత్త కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేసారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటంతో ఇప్పుడు వారికి కార్డుల మంజూరు పైన కసరత్తు జరుగుతోంది.
మార్పులు – చేర్పులు
కొత్త కార్డుల జారీతో పాటుగా ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా మారటంతో ఇప్పుడు కార్డుల మంజూరు ప్రక్రియ కీలకంగా మారుతోంది. గతంలో ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించితే రేషన్ కార్డులకు అర్హులు కాదని గత ప్రభుత్వం నిర్ణయంగా అమలు చేసింది. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత కోల్పోయాయి.
కార్డుల పునరుద్దరణ
ఇప్పుడు తమ కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని వారు కోరుతున్నాయి. దీంతో, ప్రభుత్వం ఈ అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొత్తవి మంజూరు చేస్తూనే.. అనర్హుల కార్డుల తొలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక..రేషన్ వాహనాల వినియోగం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేయటంతో పాటుగా ఈ రేషన్ వాహనాలను..సిబ్బంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించనున్నారు.