మూసీ సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. నది ప్రక్షాళనలోనూ అడ్డంకులను ఎదుర్కుని ముందుకెళ్తున్నారు. గూడు కోల్పోతున్న మూసీ ముంపువాసులకు మరోచోట ఆశ్రయం కల్పిస్తున్నారు. అటు అభివృద్ధి ఇటు నిర్వాసితులకు అండగా నిలబడుతూ ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy )అడుగులు చేస్తున్నారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా మూసీ రివర్(Musi River) ఫ్రంట్ డెవలప్‌మెంట్ కూడా యువ ఇంజనీర్ల చేతుల మీదుగా జరుగుతుందన్నారు. మూసీకి పట్టిన మకిలిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు అన్ని విధాల ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇవాళ మూసీ నది అంటే ఓ మురికి కూపంగా జనం చూస్తున్నారని.. ఇకపై అలా ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. ఇంట్లో ఆడపిల్లలకు మూసీ పేరు ఎందుకు పెట్టకూడదని రేవంత్ ప్రశ్నించారు. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు.. మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా సుందరీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత గరంగా ఉన్నారో.. పదవీ విరమణ చేసేవరకు అలాగే ఉండాలని ఉద్యోగులకు సీఎం సూచించారు. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటామా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా అని సీఎం నిలదీశారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. అనవసర విషయాలను పక్కన పెట్టి మూసీ నిర్వాసితులను ఏవిధంగా ఆదుకుందామో సలహాలివ్వండి అంటూ విపక్షాలకు సూచించారు.
కేసీఆర్ పదేళ్లు తన కుటుంబానికి ఉపాధి కల్పించుకున్నారే తప్పా.. నిరుద్యోగులకు గాలికి వదిలేశారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కేసీఆర్ ముసుగు తొలగిపోయిందని.. ఇక ఆయన్ని ఎవరూ నమ్మరని తేల్చేశారు. మూసీ ప్రక్షాళనే తన ధ్యేయమని చెప్పారాయన. కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొద్దాం రావాలని ఈటలకు సవాల్ విసిరారు.కేసీఆర్‌కు కొంతకాలం తెలంగాణ ఉద్యమమనే ముసుగు, రక్షణ కవచం ఉన్నాయన్నారు. ఇవాళ ఆ ముసుగు తొలగిపోవడంతో ముఖం చెల్లక ఎక్కడో ఉన్నారని కౌంటర్ విసిరారు.
హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ అయిపోయిందని.. గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా మూసి నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. మరో 10 వేల కోట్లు ఖర్చు చేసి.. మూసీ బాధితులను ఆదుకోలేమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.