ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అజ్మతుల్లా కుటుంబంలో అస్వియా (7) అనే బాలిక హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ, జిల్లా ఎస్పీ సుమిత్ కుమార్ తో కలిసి బాలిక అస్వియా హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అస్వియా తండ్రి అజ్మతుల్లా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని ఎస్పీ మణికంఠ చెప్పారు. అజ్మతుల్లా ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలో హసీనా అనే మహిళ నివాసం ఉంటుందని, గత సంవత్సరం హసీనా ఇంటిని నిర్మించడానికి వడ్డీ వ్యాపారి అజ్మతుల్లా దగ్గర రూ 3.50 లక్షలు వడ్డీకి తీసుకుందని, కొంతకాలం ప్రతి నెల వడ్డీ చెల్లించిందని జిల్లా ఎస్పీ మణికంఠ వివరించారు. తన దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్లు సరైన సమయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వడ్డీ వ్యాపారి అజ్మతుల్లా గట్టిగా తిట్టేవాడని ఎస్పీ మణికంఠ అన్నారు.
ఇదే సమయంలో చెప్పిన సమయానికి హసీనా డబ్బులు తిరిగి ఇవ్వలేదని, ఈ విషయంపై అజ్మతుల్లా ఆమెకు చాలాసార్లు ఫోన్ చేసి తిట్టాడని జిల్లా ఎస్పీ వివరించారు. అందరి ముందు తనను తిట్టాడని, తన పరువు తీశాడని హసీనా వడ్డీ వ్యాపారి అజ్మతుల్లా పై కసి పెంచుకుందని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించిందని ఎస్పీ మణికంఠ తెలిపారు. హసీనా, ఆమె కూతురు రేష్మాతో కలిసి వడ్డీ వ్యాపారి అజ్మతుల్లా కూతురు అస్వియాను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారని జిల్లా ఎస్పీ అన్నారు.
గత నెల 29వ తేదీన నిందితురాలు రేష్మా బుర్కా వేసుకుని ఇంటి సమీపంలో ఆడుకుంటున్న అజ్మతుల్లా కుమార్తె అస్వియాకు చాక్లెట్ ఇచ్చి ఆమె ఇంటికి తీసుకెళ్ళిందని జిల్లా ఎస్పీ మణికంఠ వివరించారు. ఆతర్వాత అస్వియాకు భోజనం పెట్టారని, కొంత సమయానికి తాను మా ఇంటికి వెళ్లాలని అస్వియా గొడవ చేసిందని, చాలా సేపు ఏడ్చిందని జిల్లా ఎస్పీ మణికంఠ వివరించారు. అస్వియా ఏడుపు బయట వినిపిస్తే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్న హసీనా ఆమె కుమార్తె రేష్మాతో కలిసి బాలిక ముక్కు, నోరు గట్టిగా మూసివేశారు.
ఆ సందర్భంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక అస్వియా పెనుగులాడిందని, ఆ సందర్బంలో హసీనా, రేష్మా శరీరంపై బాలిక గోర్లు గీచుకున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చెప్పారు. ఆ తర్వాత ఓ మైనర్ బాలుడిని ఇంటి బయట కాపలా పెట్టిన హసీనా, ఆమె కూతురు రేష్మా బాలికకు ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తానని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ వివరించారు.చివరికి రేష్మాకు తమ్ముడు వరుస అయిన మైనర్ బాలుడి బైక్ లో అస్వియా మృతదేహాన్ని తీసుకెళ్లి పుంనూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ లో విసిరేశారని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ వివరించారు.
సుమారు 14 బృందాలతో బాలిక కోసం పగలు రాత్రులు గాలించామని, అయినా ఫలితం లేకుండా పోయిందని, బాలికపై హత్యాచారం జరగలేదని వైద్యులు చెప్పారని జిల్లా ఎస్పీ మణికంఠ వివరించారు బాలిక హత్య కేసులో అత్యుత్సాహం చూపిస్తున్న కొన్ని మీడియా సంస్థలపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కేసులో కొన్ని మీడియా సంస్థలు స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని, అలాంటి వారిపైన ఎందుకు కేసులు పెట్టకూడదో చెప్పాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సుమిత్ కుమార్ అన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే మీడియా సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సుమిత్ కుమార్ ప్రజలకు మనవి చేశారు.