తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈనెల 30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు అంతా పాల్పొనేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఒక సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సదస్సులా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సదస్సులో వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల కొత్త ఆవిష్కరణలను రైతుల ముందు ఉంచాలని చెప్పారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ముందులు కొట్టేందుకు డ్రోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం ప్రదర్శించాలని అన్నారు. 30న జరిగే ఈ సభకు అప్పటికప్పుడు వెళ్లి వచ్చేలా కాకుండా మూడు రోజుల పాటూ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నుండి స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
ఆధార్ నంబర్ తప్పుగా ఉండటం, బ్యాంక్ ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండటం లాంటి కారణాల వల్ల కొంతమందికి మాత్రం మాఫీ జరగలేదని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల, అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ఈరోజునే ఇరిగేషన్ అధికారులతోనూ సీఎం సమావేశం అయ్యారు. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి నీటిని తరలింపు అంశంపై జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ, జలమండలి అధికారులతో చర్చించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి నీటిన తరలించడానికి సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.