సీఎం రేవంత్ రెడ్డితో కమ్యూనిస్టు నేతలు భేటీ అయ్యారు. లగచర్ల ఘటన తరవాత జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. సీఎంతో సమావేశమైనవారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, ఆర్ఎస్పీ నేత జానకి రాములు తదితరులు ఉన్నారు. లగచర్ల ఘటన నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నేతలు ఆయా గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వారు పరిశీలించిన విషయాలను సీఎం దృష్టికి వెళ్లనున్నారు. లగచర్ల ఘటనపై తాము రూపొందిచిన నివేదికను సీఎంకు ఇవ్వనున్నారు. లగచర్లలో భూ సేకరణ అంశంపై చర్చించనున్నారు. మరోవైపు ఇప్పటికే ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి నివేదిక అందింది. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నివేదికను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి సీఎంకు అందించారు.
ఇదిలా ఉంటే లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై కొంతమంది దాడి చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఘటన వెనక బీఆర్ఎస్ నేతలు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని గుర్తించి, పోలీసులు ఆయనను ఇప్పటికే అరెస్ట్ చేశారు. రైతులను రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు ప్రయత్నించారనే విమర్శలు వస్తున్నాయి. కేసులో ప్రధాన నింధితుడుగా ఉన్న పంచాయితీ సెక్రటరీ పోలీసుల కంట పడకుండా తప్పించుని, నేరుగా కోర్టుకు వెళ్లడంపై అనుమానాలు వస్తున్నాయి. ఘటనపై పూర్తి విచారణ తరవాత నిజానిజాలు బయటపడనున్నాయి.