చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఆరేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మైనర్ బాలిక అస్పియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధకరమైన విషయమని హోంమంత్రి అన్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు.
వైసీపీ హయాంలో వందలమందిపై అత్యాచారాలు జరిగాయన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. అయినా, ఒక్కరోజు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదన్నారు. చిన్నారి హత్యకేసును వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని, గాయాలు కూడా లేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని హోంమంత్రి తెలిపారు.
సెప్టెంబర్ 29న రాత్రి 7.30 గంటలకు బాలిక అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆ క్షణం నుంచి జిల్లా ఎస్పీ, డీఎస్పీలు, సీఐ స్థాయి అధికారులు 12 బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు అక్టోబర్ 2వ తేదీన పుంగనూరులో స్టోరేజ్ ట్యాంకులో బాలిక శవమై తేలిందన్నారు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి అనిత వివరించారు.
బాలికపై అత్యాచారం జరిగిందంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ హోంమంత్రి అనిత మండిపడ్డారు. సాక్షాత్తు జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే.. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.. తాను బాధితులను పరామర్శించడానికి వెళితే.. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని అనిత తెలిపారు. దయచేసి మైనర్ బాలిక విషయాన్ని రాజకీయం కోసం వాడుకోవద్దని వైసీపీని కోరారు. జగన్ పరామర్శకు వస్తే సరే గానీ.. రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమని మంత్రి అనిత హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసును ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగింది. ఘటనకు పాల్పడిన వారిని, సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేసేవారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం అని హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి అత్యంత విచారకరమని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. వైసీపీ నేతలు చిన్నారి హత్యను కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.