సీనీనటుడు, జనసేన నేత నాగబాబు టీటీడీ కొత్త ఛైర్మన్ నియామకంపై సోషల్ మీడియా వేధికగా స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. హిందూ ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కడం శుభసూచికమని అభిప్రాయడపడ్డారు. సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది వరకు ఉన్న అవకతవకలు అన్నీ సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠతను మరింత మెరుగుపరచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా జనసేన తరపున టీటీడీ సభ్యులుగా ఎన్నికైన బురగపు ఆనంద సాయి, అనుగోలు రంగశ్రీ, మహేందర్ రెడ్డి మరియు ఎన్నికైన ఇతర సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత టీటీడీ ఛైర్మన్ పదవి నాగబాబుకే అని ప్రచారం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. మీడియాలో సైతం నాగబాబుకు ఛైర్మన్ పదవి దక్కబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనసేన గెలుపులో నాగబాబు కీలకంగా వ్యవహరించారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం స్థానంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నాగబాబు పర్యటించి పార్టీకి సేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబుకు నామినేటెడ్ పోస్టు దక్కుతుందని ప్రచారం జరగడంతో అంతా ఆ వార్తలు నిజమేనని భావించారు. కానీ నాగబాబు మాత్రం ఆ వార్తలను ఖండించారు. తాను గానీ, పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ గానీ పోస్ట్ చేసిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని స్పష్టం చేశారు.
తనకు టీటీడీ ఛైర్మన్ పదవి వరించింది అనే వార్తలలో నిజం లేదని తెలిపారు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని కోరారు. అలా నాగబాబు క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఇక నాగబాబు తాజా పోస్టులోనూ కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో టీటీడీలో అక్రమాలు బయటపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకంలో కూటమి సర్కార్ చాలా జాగ్రత్త వహించింది. ఛైర్మన్ పదవికి పలువురి పేర్లు తెరపైకి రాగా చివరికి బీఆర్ నాయుడును ఆ పదవి వరించింది. మరి ఆయన హయాంలో టీటీడీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూడాలి.