పోలీసులు ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ పార్టీలు మాత్రం ఆగలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయ్యింది. ఈ వ్యవహారంలో నలుగురు అరెస్టయ్యారు. అందులో ఇద్దరు యువతులున్నారు. అసలేం జరిగింది.. ఇంకా డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖకు చెందిన 28 ఏళ్ల గంగాధర్ బెంగుళూరులో ఉంటున్నాడు. రామ్‌రాజ్ హాస్టల్‌లో ఉంటూ స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. బ్యాచిలర్ కావడంతో జల్సాలకు అలవాటుపడ్డాడు గంగాధర్. ఈ క్రమంలో డ్రగ్స్‌కు అలవాటు పడడం, ఆ తర్వాత సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
సీన్ కట్ చేస్తే.. భువనేశ్వర్‌కి చెందిన మహంతి అనే వ్యక్తి కొంత కాలం కిందట హైదరాబాద్‌కు వలస వచ్చాడు. కొద్దిరోజులపాటు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో గుడివాడకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తున్న యువతి పరిచయం అయ్యింది.
హైదరాబాద్‌లో ఉంటున్న ముగ్గురితో గంగాధర్‌కు ఓ పబ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెంగుళూరు కంటే హైదరాబాద్ బెటరనే నిర్ణయానికి వచ్చేశారు. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో వీరంతా దిగారు.
గంగాధర్ బెంగుళూరుకి చెందిన ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాడు. వీరంతా పార్టీ మూడ్‌లో నిమగ్నమయ్యారు. ఈ విషయం మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేశారు.
నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ, గ్రాము ఓజీ ఖుష్, ఒక ఎల్ ఎస్డీ పేపర్, 7 గ్రాముల ఇండియన్ చరస్, ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న డ్రగ్స్ విలువ మార్కెట్‌లో దాదాపు 4 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.
పట్టుబడిన వారికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఇంటీరియల్ డిజైనర్ యువతి తప్పితే మిగతా వారికి పాజిటివ్ వచ్చింది. గంగాధర్ ఫ్రెండ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు కూపీ లాగే పనిలో పడ్డారు. డ్రగ్స్ సరఫరాపై లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు.