రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడింది. ఇప్పటికే ఛార్జీల భారంతో సతమతం అవుతున్న ప్రజల పైన మరో రూ.6,072.86 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో డసెంబర్ నుంచి కొత్త వసూళ్లు ప్రారంభం కానున్నాయి. రానున్న 15 నెలల పాటు యూనిట్ పై అదనంగా రూ 1.21 మే కట్టాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మరో రూ 11,82 కోట్ల మేర మరో భారం కూడా పొంచి ఉందని తెలుస్తోంది.
ఈఆర్సీ అనుమతి
కూటమి ప్రభుత్వం ప్రజల పైన విద్యుత్ ఛార్జీల భారీ మోపింది. రూ 6,072.86 కోట్ల మేర భారం మోపేందుకు డిస్కంలకు అనుమతి లభించింది. 2022-23 సంవత్సరానికి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ వసూళ్లకు ఎపిఇఆర్‌సి అనుమతించింది. డిస్కమ్‌లు రూ.8,114 కోట్లు ప్రతిపాదిస్తే అందులో రూ.2,042 కోట్లు తగ్గించి ఉపశమనం కల్గించినట్లు ఎపిఇఆర్‌సి పేర్కొంది.
ఎక్కడ ఎంత
ఎస్‌పిడిసిఎల్ పరిధిలో సరాసరిగా నెలకు యూనిట్‌కు అత్యధికంగా రూ.0.83 పైసలు, సిడిపిడిసిఎల్ పరిధిలో రూ.0.79పైసలు, ఈడిడిసిఎల్ పరిధిలో రూ.0.80 పైసలు అదనంగా వసూలుకు అవకాశం కల్పించింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి వినియోగించిన విద్యుత్‌పై ఈ ఏడాది నవంబరు నుండి విధించే ఎఫ్‌పిపిసిఏలో నెల వారీగా యూనిట్‌కు ఎంత వసూలు చేయాలనేది కూడా సూచించింది. ఈ మొత్తాన్ని డిసెంబర్ నెల నుండి వినియోగదారుల నుండి వసూలు చేయనున్నారు.
పెరుగుతున్న భారం
ఇప్పటికే 2019-20, 20-21 సంవత్సరాలకు ఇంధన సర్దుబాటు కింద యూనిట్‌కు 40 పైసలు, 65 పైసల చొప్పున రెండు భారాలు మోస్తున్నారు. శుక్రవారంనాటి ఏపీఈఆర్‌సీ ఆదేశాల మేరకు అదనంగా యూనిట్‌కు రూ.1.21 చొప్పున మోయాల్సి వస్తుంది. మూడూ కలిపితే ప్రతి యూనిట్‌పై అదనంగా రూ.2.26 చొప్పున భారం పడనుంది. నెలవారీ కరెంటు వినియోగ చార్జీల కంటే.. సర్దుబాటు వడ్డనగా వేస్తున్నభారం పైన వినియోగదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.