రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదల తేదిపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.
ముఖ్యంగా రామ్‌చరణ్ అభిమానులు గత కొంతకాలంగా ఈ చిత్రం విడుదల తేది గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం డిసెంబర్ 25న కిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత దిల్‌రాజు ఓ పోస్టర్‌ను విడుదల చేసి అధికారికంగా తెలియజేశారు.
సీనియర్ నటుడు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రాన్ని తొలుత సంక్రాంతికి జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. అయితే చిత్ర షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులు, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పెండింగ్‌లో వున్న కారణంగా విశ్వంభర విడుదలను వాయిదా వేశారు. ఇక సంక్రాంతి బరిలో విశ్వంభర స్లాట్‌ను గేమ్ ఛేంజర్ తీసుకుంది. త్వరలో విశ్వంభర విడుదల తేదిని కూడా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.