E-PAPER

ఏపీలో రోడ్ల నిర్వహణపై కొత్తగా ఆలోచించాను: సీఎం చంద్రబాబు..

ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీని వినూత్న విధానాలతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా, రాష్ట్రంలోని రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో రోడ్ల నిర్వహణపై కొత్తగా ఆలోచించానని చెప్పారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపడతామని తెలిపారు.

 

“రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గత ఐదేళ్లు రోడ్లపై గుంతలు పెట్టడం తప్ప ఒక్క పనీ చేయలేదు. రోడ్ల కోసం రూ.850 కోట్లు మంజూరు చేశాం. ఇప్పుడిప్పుడే పనులు జరుగుతున్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగకు మన రాష్ట్రానికి వచ్చిన వాళ్లు చూసి ఆశ్చర్యపోయేలా రహదారులను మెరుగ్గా తీర్చిదిద్దుతాం. ఈ మేరకు ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. అయినాగానీ సమస్యలు ఎదురవుతున్నాయి.

 

ఎమ్మెల్యేలు కూడా వినూత్నమైన ఆలోచనలు ఉంటే పంచుకోవాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ, ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మార్చుతుంది. ఇప్పుడు రోడ్ల నిర్వహణ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలన్న ఆలోచన కూడా అటువంటిదే.

 

నేషనల్ హైవేలకు టెండర్లు పిలిచినట్టుగా… ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణను బాగా పనిచేసే ఏజెన్సీలకు అప్పగిస్తాం. ఈ విధానం ఎలా ఉంటుందంటే… గ్రామం నుంచి మండలం వరకు ఎక్కడా టోల్ ఫీజు ఉండదు. మండల పరిధి దాటితే టోల్ ఫీజు ఉంటుంది. అది కూడా… కార్లు, లారీలు, బస్సుల వంటి వాహనాలకే టోల్ ఫీజు ఉంటుంది. బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, ఆటోలకు టోల్ ఫీజు ఉండదు.

 

దీనివల్ల కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బును వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విధానం బాగుందని రిపోర్టు వస్తే… ప్రజాప్రతినిధులు దానిపై ప్రజలను ఒప్పించగలగాలి. అప్పుడు ఆ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళదాం. అలాకాకుండా, ఈ విధానం బాగాలేదనుకుంటే… మనం మళ్లీ గుంతల రోడ్లలోనే తిరుగుదామనుకుంటే నాకేం అభ్యంతరం లేదు” అంటూ చంద్రబాబు నేడు అసెంబ్లీలో సభ్యులను ఉద్దేశించి వివరించారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram