E-PAPER

తెలంగాణలో ఈవీలకు నో రోడ్ ట్యాక్స్, నో రిజిస్ట్రేషన్ ఫీజు..

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పర్యావరణానికి హాని కలిగించకుండా, వాయు కాలుష్యాన్ని నియంత్రించేలా అడుగు ముందుకేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది.

 

ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకూ వర్తింపజేసింది. అన్ని రకాల వాహనాలు అంటే- టూ వీలర్లు, కార్లు, బస్సులు, ట్రాక్టర్లు, ఇ- ఆటోలు, ట్యాక్సీలు.. ఇలా ఏ వాహనమైనా సరే అవి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చాలు- వాటికి రోడ్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ల ఫీజు నుంచి వంద శాతం మినహాయింపు ఉంటుంది.

 

వాటిని కొనుగోలు చేసిన వాళ్లు ఒక్క రూపాయి కూడా రోడ్ ట్యాక్స్ గానీ, రిజిస్ట్రేషన్ ఫీజు గానీ చెల్లించనక్కర్లేదు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ట్యాక్సీలు, టూరిస్ట్ క్యాబ్స్‌, ప్రైవేట్ కార్లకూ ఈ విధానం కిందికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నాన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే అన్ని ఇ- ఆటోలకూ ఈ విధానం వర్తిస్తుంది.

 

ఆయా ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఇకపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. ఈ వెసలుబాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధీనంలోని ఎలక్ట్రిక్ బస్సులకు కూడా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి కాలం పాటు మినహాయింపు లభించింది.

 

అలాగే- ఏవైనా పరిశ్రమలు తమ ఉద్యోగులను తరలించడానికి వినియోగించే ఎలక్ట్రిక్ బస్సులకూ ఈ మినహాయింపు లభించింది. తాము పని చేస్తోన్న ప్రదేశానికి ఉద్యోగులను తీసుకెళ్లడం, మళ్లీ వాళ్లను ఇంటి వద్దకు చేర్చే ఈవీ బస్సుల కోసం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టనక్కర్లేదు.

 

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram