వైసీపీ ఎమ్మెల్సీకి షాకిచ్చారు జనసేన నాయకులు. గతంలో ఆ ఎమ్మెల్సీ చేసిన కామెంట్స్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదునిచ్చారు వారు. నిరంతరం వార్తల్లో నిలిచే ఆ ఎమ్మెల్సీపై జనసేన నాయకులు ఫిర్యాదు ఇవ్వడం, కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకు ఆ ఎమ్మెల్సీ ఎవరో కాదు దువ్వాడ శ్రీనివాస్.
ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు నిఘా ఉంచిన విషయం తెలిసిందే. గతంలో హద్దులు మీరి సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఒక్కొక్కరి భరతం పడుతున్నారు పోలీసులు. అలాగే తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఒక్కొక్క వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన క్యాడర్ గురి పెట్టిందని చెప్పవచ్చు. మొన్న మాజీ మంత్రి విడదల రజినిపై టీడీపీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నాడు పోలీసులు అక్రమంగా తీసుకువచ్చి కొట్టారని, ఆ దృశ్యాలను రజిని సెల్ ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించినట్లు వారి ఆరోపణ.
ఇలా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం సాగుతున్నప్పుడే వైసీపీ నేతలపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈదశలోనే యర్రగొండపాలెం ఎమ్మేల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు సైతం పోలీసులు తాజాగా 41ఏ నోటీసులు జారీ చేశారు. మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నది ఫిర్యాదు. ఇది ఇలా ఉంటే తాజాగా టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను, అలాగే టెక్కలి జనసేన కార్యాలయంపై దాడులకు సంబంధించి కూడా జనసేన టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
దీనితో పోలీసులు కూడా దువ్వాడపై కేసు నమోదు చేశారు. కాగా దువ్వాడ శ్రీనివాస్ పేరు వెలుగులోకి వచ్చిన మరుక్షణం దివ్వెల మాధురి పేరు వినిపించాల్సిందే. జనసేన నేతల ఫిర్యాదుతో ప్రస్తుతం దువ్వాడపై కేసు నమోదు కాగా, మాధురి ఏవిధంగా స్పందిస్తారన్నది వేచిచూడాలి. గతంలో దువ్వాడకు కష్టం వస్తే తానెప్పుడూ వెంట ఉంటానని, నా రాజా అంటూ పిలిచే మాధురి ఈ విషయంలో జోక్యం చేసుకుంటారా.. లేక సైలెంట్ గా ఉంటారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏదిఏమైనా దువ్వాడపై కేసు నమోదు కావడం చూస్తే, పోలీసులు నోటీసులు ఇస్తారా? అదుపులోకి తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.