రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతల పేర్లు బయటపడుతున్నాయి. పోలీసులు ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు. ఒక్కొక్కొరిగా ఫోన్ ట్యాపింగ్ బాధితులను, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని విచారిస్తున్నారు. దీంతో బడా నాయకుల నుండి చోటా నేతల వరకు పలురురి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు అధికారులు సైతం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో నేడు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరైన సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ముప్పై నంబర్లు జరిపినట్టు అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ పోలీసులు తనను పిలిచి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. ఈరోజు మరోసారి రావాలని పోలీసులు పిలిచారన్నారు. సిద్దిపేటలో ఓడిపోతాడనే భయంతోనే హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేశాడని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రంగనాయక సాగర్ స్కామ్ బయటపెట్టానని అందుకే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. కేటీఆర్ సినిమా వాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తే హరీష్ రావు రాజకీయనాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద సిట్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. హరీష్ రావుని పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం బయటపడుతుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిమీద చర్యలు తీసుకోవాలని చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు.