విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటైన జాతీయ విద్యా దినోత్సవం వేడుకలకు హాజరు కానున్నారు.
మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది.
దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజైన నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకొంటారు. అదే రోజున మైనారిటీ సంక్షేమ వేడుకలను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది.
ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఉదయం 10:20 నిమిషాలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ విజయవాడకు బయలుదేరుతారు. 10:30 నిమిషాలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మైనారిటీల కోసం కొన్ని వరాలను ప్రకటించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోన్న కృషిని ఆయన మరోసారి వివరిస్తారు. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చుతున్న విషయాన్ని పునరుద్ఘాటిస్తారు.
ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.