తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సందడి చేసే వ్యక్తి మాత్రం కేఏ పాల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేఏ పాల్ సంచలనం సృష్టిస్తున్నారు.
ఆయన మాటలతో ఎప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడిన ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి అని పేర్కొన్నారు. ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్ గా పనిచేయడం లేదని చెబుతూ, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కే ఏ పాల్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ మెజారిటీ సీట్లు సంపాదించుకుంటుంది అని ఈవో వికాస్ రాజ్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి తనకు చెప్పారని, వారు తమ ఉద్యోగాలు పోయినా పర్వాలేదని తనకు ఈ విషయాలు చెప్పారని కేఏపాల్ తెలిపారు. ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లద్దాక్ ఎన్నికలు రద్దు చేశారని గుర్తు చేసిన ఆయన, తన పార్టీకి సింబల్ ఇవ్వనందుకు పోరాటం చేస్తానన్నారు.
ప్రజాశాంతి పార్టీని ఇన్ యాక్టివ్ చేసినందుకు, సింబల్ ఇవ్వనందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీకి సింబల్ కేటాయించకపోతే, ఎన్నికలలో తాము లేకుంటే తాము డోంట్ వోట్.. వోట్ ఫర్ నోటా తో ప్రజల్లోకి వెళతామని ఆయన తెలిపారు. అంబేద్కర్ మరియు గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామని ఆయన ప్రజలకు సూచించారు.
ప్రజాశాంతి పార్టీ ఎన్నికల్లో పోటీ లేదు కాబట్టి అందరూ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీ సభపై మండిపడిన కేఏ పాల్ మంద కృష్ణ మాదిగకు మోడీ కోట్ల రూపాయలు ఇచ్చి సభ పెట్టించారని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీలో లేము అని చెప్తూనే ప్రజాశాంతి పార్టీ 80 స్థానాలు గెలుస్తుందని కేఏ పాల్ చెప్పటం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ఎన్నికల సమయంలో మంచి కామెడీ చేశారు కేఏ పాల్.