హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించాలని కేటీఆర్(KTR) అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (యుఎఫ్‌ఆర్‌డబ్ల్యుఎ) సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు.
“మాకు మతపరమైన అల్లర్లు లేదా ప్రాంతీయ కలహాలు లేవు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ట్యాగ్‌ని సాధించి 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ లో పార్కులు, నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రత్యేకంగా అదనపు ప్రత్యేక కమిషనర్లను బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిందన్నారు. తాగునీటి కోసం ప్రతిపక్ష పార్టీలు గతంలో చేసిన నిరసనలను గుర్తుచేసుకున్న కేటీఆర్, నీటి కష్టాలు గతం అని.. గోదావరి నది నీటిని సరఫరా చేసే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. తద్వారా హైదరాబాద్‌కు 24 గంటల నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
టెక్ ఉద్యోగాల సృష్టిలో హైదరాబాద్ నిలకడగా బెంగళూరును అధిగమించిందన్నారు. ఐటీ లేదా టెక్నాలజీ రంగంలో ఒక ఉద్యోగం ఆతిథ్యం, పర్యాటకం, నిర్మాణ రంగాల్లో మూడు నుంచి నాలుగు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. గత 9.5 ఏళ్లలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పోయిన రెండేళ్లను తీసివేసి 36 ఫ్లైఓవర్‌లను నిర్మించామని, 39 సరస్సులను అభివృద్ధి చేసి సుందరీకరించామని, వారసత్వ కట్టడాలను పునరుద్ధరించామని కేటీఆర్ అన్నారు.
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణారావు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి లింక్ రోడ్‌లను అభివృద్ధి చేసే భావనను ప్రశంసించారని కేటీఆర్ గుర్తు చేశారు. కారు (బీఆర్‌ఎస్ సింబల్) మంచి కండిషన్‌లో ఉండి.. డ్రైవర్ బాగుంటే కొత్తదనం కోసం దాన్ని మార్చాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.