E-PAPER

ఎస్సీ వర్గీకరణకు కమిటీ-ప్రధాని మోడీ హామీ-కాంగ్రెస్,బీఆర్ఎస్ పై నిప్పులు..

అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు వచ్చిన బంధువులకు నా శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పండుగ సమయంలో తమ సొంత మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ఆ సంతోషం రెట్టింపవుతుందని మాదిగల్ని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను తన చిన్న తమ్ముడిగా ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో చాలా ప్రభుత్వాల్ని చూశామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదంతో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోందన్నారు. గుర్రం జాషువాను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఒకే లక్ష్యంతో అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేస్తున్నారని, ఇప్పుడు ఆయనకు తాను కూడా తోడయినట్లు ప్రధాని మోడీ తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయని, తప్పాయని కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఎలా విస్మరించాయో ప్రధాని మోడీ వివరించారు. తెలంగాణ రాకముందు దళితుడిని సీఎం చేస్తానన్న బీఆర్ఎస్, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక దళిత బంధు పేరుతో కూడా వారిని మోసం చేశారన్నారు. ఆయన కుటుంబానికి మాత్రం కావాల్సిన మేలు చేసుకున్నారన్నారు.

గతంలో బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ప్రధాని మోడీ అన్నారు. దళిత ద్రోహి అయి బీఆర్ఎస్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో కాంగ్రెస్ తోనూ అంతే జాగ్రత్తగా ఉండాలన్నారు. అంబేద్కర్ రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేస్తే ఓడించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టనివ్వలేదన్నారు. బీజేపీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన విగ్రహం పెట్టడంతో పాటు ఆయనకు భారతరత్న ఇచ్చామన్నారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram