మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించే అన్ని రాజకీయ ప్రకటనలకు అనుమతులను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(EC) శనివారం ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) అన్ని ఛానెల్‌లు, సోషల్ మీడియా ఛానెల్‌లకు లేఖలు రాశారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయి ధ్రువీకరణ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలను ‘దుర్వినియోగం’ చేస్తున్నారని లేఖల్లో సీఈవో ఆరోపించారు. ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని “ఇష్టానుసారం ప్రసారం చేయడం” ద్వారా ప్రకటనలను ఉల్లంఘిస్తున్నందున వాటిని రద్దు చేస్తున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కార్యాలయం పేర్కొంది.
తక్షణమే ప్రకటనల ప్రసారాలను నిలిపివేయాలని ఛానళ్లను ఆదేశించింది. ఈ ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు మరియు క్లిప్‌లను కూడా సీఈఓ కార్యాలయం జత చేసిందని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ రూపొందించిన యాడ్స్ పై బీఆర్ఎస్ లిగల్ వింగ్ ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమించిందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకుండానే ఇచ్చినట్లు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల నుంచి ఆ వీడియోలను తెప్పించామని.. కాంగ్రెస్ పార్టీ యాడ్స్‌పై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం సీరియస్ అయిందని ఆయన చెప్పారు. మార్పు కావాలి- కాంగ్రెస్ రావాలి.. పేరుతో ఓ సెటైరికల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.నిరుద్యోగులు, రైతులు, ధరణి పోర్టల్, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలపై కాంగ్రెస్ యాడ్స్ రూపొందించింది. ప్రతి యాడ్ లో కారు పంక్షర్ పేరుతో వినూత్న రీతిలో ప్రకటనలు రూపొందించింది. ఈ యాడ్స్ ప్రజల్లోకి వేగంగా వెళ్తోన్నాయి.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ రాజకీయ ప్రకటనలకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.