గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. జెడ్పీ ఛైర్మన్ లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్ లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని పార్టీ అధినేత జగన్ చెపుతున్నప్పటికీ… రాజీనామాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా, వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయబోతున్నారు. ఈరోజు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు నచ్చకే రాజీనామా నిర్ణయానికి అవంతి వచ్చినట్టు చెపుతున్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.