E-PAPER

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లు..? కేంద్రం కసరత్తు..

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కోరిన కేంద్రం.. దాన్ని సభలో మాత్రం ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ ప్రతిపాదనతో పాటు జమిలి ఎన్నికల బిల్లును కూడా ఒకేసారి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు సమాచారం.

 

ఈ నెల 20 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజైన 20వ తేదీనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. అదే రోజు దానికి ఆమోద ముద్ర కూడా వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జమిలి ఎన్నికలపై కసరత్తు మరింత వేగం పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

జమిలి ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎప్పటి నుంచో సిద్ధమవుతోంది. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ నేతృత్వంలోని కమిటీ జమిలి ఎన్నికలకు మద్దతుగా ప్రతిపాదనలు కూడా చేసింది. దీంతో పాటు కేంద్రం జమిలిపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కూడా కోరింది. ఈ అభిప్రాయం కూడా తీసుకుని ఈ నెలలో ముగిసే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షాల నుంచి జమిలి ఎన్నికలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. పార్లమెంట్ ఉభయసభల్లో తమకున్న మెజార్టీతోనే దీన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram