ఏపీలో ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంటే కలెక్టర్లు నిస్సహాయులై చూస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరే నిస్సహాయులైతే ప్రజలకు ఇంకెవరు దిక్కని వారిని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నీ కల్తీ అయిపోతున్నాయని, స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేసినా ఫలితం లేదన్నారు.
ఇసుక వ్యవహారాన్ని క్రమబద్ధీకరించాలని చంద్రబాబు మొత్తుకుంటున్నారని, కానీ ఎమ్మెల్యేల జోక్యం మాత్రం ఆగడం లేదన్నారు. ఇకపై ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యేలను పవన్ హెచ్చరించారు. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నామని, మీకు అవసరమైన మద్దతిస్తామని పవన్ కలెక్టర్లకు తెలిపారు. మిమ్మల్ని ఏది ఆపుతోందని కలెక్టర్లను పవన్ ప్రశ్నించారు. తాము మాత్రం చిత్తశుద్దిగా ఉన్నామన్నారు.
ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రతిసారీ మీ ఏపీలో పాలనపైనే చర్చ జరుగుతోందన్నారు. గతంలో తాను ప్రభుత్వం బయట ఉండి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏదో చేస్తారని అనుకునేవాడినని, కానీ పరిస్దితి అలా లేదన్నారు. వ్యవస్ధల్ని మీరు బలోపేతం చేయాలి కానీ, ఇలా నిస్సహాయతతో చూస్తుంటే సగటు మనిషి ఎక్కడికెళ్తాడని పవన్ కలెక్టర్లను ప్రశ్నించారు. క్షేత్రస్దాయిలో పరిస్దితులు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు కానీ మీరు మాత్రం నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందేనని పవన్ కలెక్టర్లకు సూచించారు.