E-PAPER

మనదీ ఒక బతుకేనా.. మనకంటే కాకి నయం: పూరి జగన్నాథ్..

‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆసక్తికర, ఆలోచనాత్మక సంగతులు పంచుకునే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి మానవ జీవన విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘లాడ్జ్’ టైటిల్‌తో విడుదలైన ఈ వీడియోలో.. మానవుడి స్వేచ్ఛపై పెదవి విరిచారు. మనకంటే కాకులు నయమని తేల్చి పారేశారు. ఈ భూమ్మీద ఉన్న కోట్లాది జీవాలు చాలా తేలిగ్గా, సరదాగా, పైసా ఖర్చు లేకుండా ఆనందంగా బతికేస్తున్నాయని, కానీ, ఇదే గ్రహంపై ప్రతి దానికీ డబ్బు కడుతూ బతుకుతున్న ఏకైక జీవి మనిషేనని పేర్కొన్నారు.

 

దేవుడు మనకిచ్చిన ఈ గ్రహంపై ప్రతిదానికీ డబ్బు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. పక్షి తనకు నచ్చిన చోట గూడు కట్టుకుంటుందని, చెట్టు తనకు ఇష్టమున్న ప్రాంతంలో మొలుస్తుందని, తిమింగలం తలచుకుంటే ప్రపంచ యాత్ర చేస్తుందని, అడవిని దాటేందుకు సింహానికి పాస్‌పోర్ట్ అవసరం లేదని వివరించారు. ఆఫ్రికాలోని కొంగలు కొల్లేరు గెస్ట్‌హౌస్‌లో కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాయని, ఇవన్నీ ఫ్రీగా, క్రెడిట్‌కార్డు లేకుండా బతుకుతున్నాయని పేర్కొన్నారు.

 

కానీ మనం ఏదైనా తినాలన్నా, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలన్నా డబ్బులు కావాలని, నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలని, దేశ సరిహద్దులు దాటాలంటే పాస్‌పోర్టు కావాలని చెప్పుకొచ్చారు. ప్రపంచాన్ని ముక్కలు చేసుకున్నామని, అది వేరే దేశమని, ఇది మనదని చెప్పుకోవడమే కాకుండా మన దేశం బతికినంత కాలం కూడా డబ్బు కడుతూనే ఉండాలని, చివరికి సమాధికి కూడా డబ్బులు చెల్లించాల్సినంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామని, ఈ పేమెంట్ సిస్టం వల్ల ప్లానెట్ అర్థమే మారిపోయిందని పూరి ఆవేదన వ్యక్తం చేశారు.

 

నిజం చెప్పాలంటే ఇది హోం కాదని, లాడ్జ్ అని పూరి చెప్పుకొచ్చారు. రెంట్ చెల్లించేందుకు రోజూ అందమైన క్షణాలను అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు పనిచేస్తున్నామో ఎవరికీ తెలియదని, ఎంజాయ్ చేసే సమయం ఎవరికీ లేదని, ప్రపంచాన్ని చుట్టే సమయం, రాతంత్రా వెన్నెల్లో కూర్చునే సమయం కూడా లేకుండా డబ్బుల కోసం పరుగులు పెడుతూనే ఉన్నామని వాపోయారు.

 

సముద్రం, పర్వతం, అడవి ఇలా అన్నింటినీ దేవుడు మనకు ఇచ్చాడని, కానీ దేనినీ ఆస్వాదించలేకపోతున్నామని తెలిపారు. మనిషి వ్యవసాయం నేర్చుకుని స్థిరపడడమే ఈ అనర్థాలకు కారణమన్నారు. జీవితంలో సెటిల్ అయ్యామని అనుకుని మనిషి దారి తప్పాడని చెప్పారు. తాడుబొంగం లేని జీవితమే బాగుంటుందని, పక్షుల్లా ఎగురుకుంటూ వెళ్లొచ్చన్నారు. మనం పుట్టింది అద్దెలు కట్టడానికా? అని ప్రశ్నించారు. మన కంటే కాకి మేలని అభిప్రాయపడ్డారు. మళ్లీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టించవద్దని వేడుకుందామని, మనకు కావాల్సింది హోం కానీ, లాడ్జ్ కాదని పూరి ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram