పార్లమెంటు రాజ్యసభ సమావేశాల్లో శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధనకర్ షాకింగ్ ప్రకటన చేశారు. సీట్ నెంబర్ 222 కింద గురువారం చెకింగ్ చేసే క్రమంలో కరెన్సీ నోట్ల కట్ట లభించిందని అది ఒక కాంగ్రెస్ ఎంపీకి కేటాయించిన సీటు అని ప్రకటించారు. పైగా ఆ సీటు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఎంపీ అభిషేక్ మను సింఘ్వీదని పేరు కూడా వెల్లడించేశారు. దీంతో సభలో బిజేపీ, కాంగ్రెస్ ఎంపీలో రచ్చ చేశారు.
బిజేపీ ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీపై విమర్శలు చేయగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధనకర్ తీరుని తప్పుబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీటు క్యాష్ దొరికిన కేసులో విచారణ కొనసాగుతుండగా కాంగ్రెస్ ఎంపీ పేరుని ఎలా బహిర్గతం చేస్తారని ఉపరాష్ట్రపతి ధనకర్‌ని నిలదీశారు.
రాజ్యసభ చైర్మెన్ జగ్దీప్ ధనకర్ ఏమన్నారంటే?..
“నిన్న (గురువారం డిసెంబర్ 5, 2024)న రాజ్యసభ హౌస్‌లో భద్రతా సిబ్బంది సెక్యూరిటీ చెకింగ్ చేస్తుండగా వారికి సీటు నెంబర్ 222 కింద కరెన్సీ నోట్ల (రూ.500) కట్ట లభించింది. వారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నేను వెంటనే విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను. ఆ సీటు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకు కేటాయించబడింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది” అని చైర్మెన్ జగ్దీప్ ధనకర్ ప్రకటించారు.
చైర్మెన్ ధనకర్ ప్రకటనలో దోషిపై బిజేపీ ఎంపీలు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయగా.. కాంగ్రెస అధ్యక్షుడ మల్లికార్జున ఖర్గే మాత్రం చైర్మెన్ ప్రకటనని తప్పుబట్టారు. విచారణ పూర్తి కాకుండానే కాంగ్రెస్ ఎంపీ అంటూ అభిషేక్ మను సింఘ్వి పేరు బహిర్గతం చేయడాన్ని తప్పబట్టారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ రాజస్యభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. తాను జీవితంలో తొలిసారి ఇలాంటి ఘటన గురిచి విన్నానని.. తాను రాజ్యసభకు కేవలం రూ.500 మాత్రమే తీసుకెళతానని తెలిపారు. “ఇలా ఘటన గురించి వినడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి వినలేదు. నేను రాజ్యసభ వెళ్లే సమయంలో కేవలం ఒకే ఒక రూ.500 కరెన్సీ నోటుని తీసుకెళ్తాను. నేను నిన్న గురువారం రాజ్యసభ హౌస్‌కు మధ్యాహ్నం 12.57 గంటలకు లోపలికి వెళ్లాను. అక్కడ కేవలం కొన్ని నిమషాలు మాత్రమే కూర్చున్నాను. ఆ తరువాత 1.30 గంటల వరకు క్యాంటీన్ లో ఉన్నాను. ఆ తరువాత తిరిగి వచ్చేశాను” అని వివరించారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ అయిన అభిషేక్ మను సింఘ్వీ.. రాజ్యసభ పదవి కాలం 2026 సంవత్సరంలో ముగియనుంది.
పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ అదానీ అవినీతి ఆరోపణలు, మణిపూర్ హింస ఘటనలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇరు సభలలో చర్చలు జరగడం లేదు. స్పీకర్లు వాయిదా వేస్తూనే ఉన్నారు.