ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఇందుకు వేదికగా మారింది హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో హోం శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పలు స్టాల్స్ లను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు వాటిని పరిశీలించారు.
అనంతరం ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టే ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాల లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే వరదల సమయంలో తక్షణం సేవలు అందించేందుకు వినియోగించే బోట్లను సైతం సీఎం ప్రారంభించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు ఉపయోగపడేలా నూతన బోట్లను ప్రభుత్వం బోట్లను రూపొందించింది. అలాగే హోంశాఖ నిర్వహించిన విజయోత్సవాలలో తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలను చాటిచెప్పేలా పలు ప్రదర్శనలు సైతం సాగాయి. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల ప్రదర్శన ప్రజా ప్రతినిధులు, అధికారులను ఆకట్టుకుంది.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. మహనీయులు అంబేద్కర్ స్పూర్తితో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్చను ఇచ్చిందన్నారు. ఇప్పటికే తాము ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టామని, అదే రీతిలో ఏడో గ్యారంటీగా స్వేచ్చను అందించమని సీఎం అన్నారు. పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం అన్ని విధాలా పోలీసులకు సహకరిస్తుందన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారని, మరింత స్పీడ్ పెంచాల్సిన ఆవశ్యకత పోలీసులపై ఉందన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ శాఖలో బదిలీల, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినట్లు సీఎం పునరుద్ఘాటించారు.
హైదరాబాద్ అంటేనే డ్రగ్స్ విక్రయాలు నిర్వహించేందుకు భయపడే రీతిలో పోలీసులు విధులు నిర్వర్తించాలని సీఎం సూచించారు. అలాగే విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కూడా పోలీస్ శాఖ కూడా తన వంతు భాద్యత వహించాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్స్ ను తీసుకొని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, సమాజ నిర్లక్ష్యానికి గురైన వారి విధులను పోలీస్ శాఖ సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు.
ఉగ్రవాదుల ముప్పు సమయంలో గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణాలు అర్పిస్తే వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తూ తోడ్పడుతుందన్నారు. తెలంగాణ హోం గార్డ్స్ కి జీతాలు పెంచినట్లు సీఎం శుభవార్త చెప్పారు. ఎవరైనా హోం గార్డ్స్ విధుల్లో ప్రాణాలు అర్పిస్తే, వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. అంతేకాకుండా వారికి హెల్త్ కార్డ్ లు కూడా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కొత్త సంవత్సరంలో నూతన ఆదేశాలు అమలవుతాయని సీఎం అన్నారు. పోలీస్ కుటుంబాల పిల్లల చదువుల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, అందుకు 50 ఎకరాలలో స్కూల్ నిర్మించడం జరుగుతుందని, హోం గార్డ్ నుండి డీజీపీ స్థాయి అధికారి పిల్లలకు ఉచిత విద్యను కార్పొరేట్ స్థాయిలో అందిస్తామని సీఎం వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో సుమారు 94 వేల మంది పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి ఉత్తమ విధులతోనే రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పుడూ ముందంజలో ఉందని సీఎం అన్నారు.