E-PAPER

రాష్ట్రంలో రెండు కొత్త బస్ డిపోలు, అనుమతులు మంజూరు చేసిన తెలంగాణ సర్కారు..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో కొత్త బస్ డిపోలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ములుగు, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్ కాపీలను త్వరలో స్థానిక ప్రజా ప్రతినిధులకు అందించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయన్నారు.

 

నష్టాల బాటలో నుంచి లాభాల వైపు..

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి అడుగు పెట్టిందని మంత్రి పొన్నం వెల్లడించారు. “దాదాపు ఆర్టీసీలో 10, 15 సంవత్సరాల తర్వాత రెండు కొత్త డిపోలను ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రవాణాశాఖ మంత్రిగా నాకు చాలా సంతృప్తిని ఇస్తున్నది. గత 10, 15 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని ఈ రోజు లాభాల బాటలోకి తీసుకుపోతున్నాం. తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు చేస్తున్నాం. ఆర్టీసీలో నూతన ఉద్యోగ నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, పలు సంస్కరణలు ,కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నం. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లా లోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నాం” అని పొన్నం వివరించారు.

 

సీతక్క, శ్రీధర్ బాబుకు ఆర్డర్ కాపీలు అందిస్తాం..

 

ములుగు, పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసే బస్సు డిపోలకు సంబంధించి ఇప్పటికే ఆర్డర్లు జారీ అయినట్లు మంత్రి పొన్నం తెలిపారు. “కొత్త బస్ డిపోలకు సంబంధించిన ఆర్డర్ కాపీలను త్వరలోనే ఆయా జిల్లాల మంత్రులు అయిన సీతక్క, శ్రీధర్ బాబుకు అందిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ముందడుగు వేస్తుందనడానికి ఈ బస్సు డిపోలు నిదర్శనం. రెండు కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణీకులకు ఎంతో మేలు కలగనుంది. ములుగు జిల్లా మూడు, నాలుగు జిల్లాలకు సరిహద్దు. సమ్మక్క సారలమ్మ కొలువైన ప్రాంతం. తొందరలోనే అక్కడ బస్సు డిపో నిర్మాణం చేపట్టి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. పెద్దపల్లి పారిశ్రామిక కేంద్రం. జిల్లా కేంద్రం చేసినప్పటికీ బస్సు డిపో లేదు. అక్కడి శాసనసభ్యుడు, మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకు ఈ బస్సును మంజూరు చేస్తున్నాం. ములుగు, పెద్దపల్లి జిల్లా ప్రజలకు రవాణాశాఖ మంత్రిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

 

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఫ్రీగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జీవం పోసినట్లు అయ్యింది. సర్కారు నిర్ణయంతో ఆర్టీసీకి మంచి ఆదాయం అందుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram