E-PAPER

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం..! ఇక నుండి వైసీపీ పోరుబాట..!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావటంతో ఇక తమ పాత్ర పోషించేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తరువాత కూటమి ప్రభుత్వం పైన మీడియా సమావేశాల ద్వారా టార్గెట్ చేస్తున్న జగన్..ఇక, పార్టీ నిరసనలకు నిర్ణయించారు. రైతు, విద్యార్థుల సమస్యల పైన పోరుబాటకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిరసనల కార్యాచరణ షెడ్యూల్ ప్రకటించారు. జనవరి రెండో వారం తరువాత జిల్లాల వారీగా పర్యటనల ప్రారంభిస్తానని జగన్ మరోసారి స్పష్టం చేసారు.

 

వైసీపీ పోరుబాట

మాజీ సీఎం జగన్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఆరు నెలల సమయం వేచి చూసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రజల తరపున పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందని వివరించారు. అందులో భాగంగా ముందు గా రైతులు, విద్యార్ధుల సమస్యల పైన నిరసనలకు నిర్ణయించారు. రైతులకు రూ 20 వేల పెట్టుబడి సాయం తో పాటుగా ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్దరణ డిమాండ్ తో ఈ నెల 11న వైసీపీ నేతలు ర్యాలీలు చేయనున్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

 

ప్రభుత్వ వైఫల్యాలపై

ఇక, ఈ నెల 27వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన కరెంట్ ఛార్జీల పైన అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయాలు..సీఎండీ కార్యాలయాలకు స్థానిక ప్రజలతో వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కరెంట్ ఛార్జీల పెంపును తక్షణమే ఉప సంహరించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదే విధంగా.. జనవరి 3న ఫీజు రీయంబర్స్ మెంట అంశం పైన పోరుబాట పట్టాలని జగన్ నిర్ణయించారు. విద్యార్ధులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో విద్యార్ధులతో కలిసి జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

 

ఇక ప్రజల్లోనే ఉండేలా

విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని.. వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జనవరి రెండో వారం తరువాత జిల్లాల పర్యటన ప్రారంభిస్తానని జగన్ మరోసారి తాజా సమావేశంలో స్పష్టం చేసారు. ప్రతీ బుధ, గురువారం జిల్లాల్లో ప్రతీ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు…కేడర్ తో సమావేశం అవ్వనున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో కేడర్ తో మమేకం అవుతూ అన్ని అంశాలు చర్చకు వచ్చేలా సమావేశం ఉంటుందని వివరించారు. ఇక, ఇప్పుడు జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రకటించిన తొలి నిరసన కార్యక్రమం కావటంతో రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram