ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటనకు సిద్దమైంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది. ఎన్నికల్లో పని చేసిన మూడు పార్టీల నేతలు తమకు నామినేటెడ్ పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించారు. ఇంకా, చాలా మంది పదవులు దక్కుతాయనే నమ్మకంతో ఉన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు – పవన్ చర్చల్లో మలి విడత జాబితా పైన చర్చించారు. ఈ లిస్టులో పలువురు సీనియర్లకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
తుది కసరత్తు
కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు నామినేటెడ్ పదవుల జాబితాలను ప్రకటించింది. తొలి జాబితాలో 21 మందికి, రెండో జాబితాలో 59 మందికి అవకాశం కల్పించారు. అయితే, ఈ రెండు జాబితాల్లో మూడు పార్టీలకు చెందిన పలువురు సీనియర్లకు అవకాశం దక్కలేదు. ఎన్నికల్లో పార్టీ సూచన మేరకు సీట్లు త్యాగం చేసిన వారికి పదవులు ఇవ్వాల్సి ఉంది. దీంతో, ఇప్పుడు ఈ జాబితా పైన మూడు పార్టీల నుంచి అందిన జాబితాల పైన కసరత్తు జరుగుతోంది. తాజాగా చంద్రబాబు – పవన్ భేటీలోనూ ఈ అంశం పైన చర్చ జరిగింది. టీడీపీలో పలువురు సీనియర్ల ఈ లిస్టు లో తమ పేర్లు ఉంటాయనే ఆశతో ఉన్నారు.
టీడీపీ నేతల ఆశలు
టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, మేక పాటి చంద్రశేఖర్‌రెడ్డి, యామినీ బాల వంటి వారు నిరీక్షిస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, కు ఈ జాబితా లో ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 60 కి పైగా కార్పోరేషన్లు భర్తీ చేయాల్సి ఉందని అంచనా. వీటితో పాటగా ప్రణాళిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటికి ఇప్పటికే పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా కుల సంఘాలకు నియామకాలు చేయాల్సి ఉంది. ఎన్నికల సమయంలో టీడీపీ గెలుపు కోసం పని చేసిన నేతలు సైతం ఈ సారి జాబితాలో తమకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు.
బీజేపీ – జనసేన నుంచి
రాజానగరంకు చెందిన నేత పెందుర్తి వెంకటేశ్ కు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్ర మాల పరిశీలన బాధ్యతలు కేబినెట్ హోదాతో అప్పగించారు. మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవీ సుబ్బారెడ్డిపదవులు ఆశిస్తున్నారు. అదే విధంగా బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి పేర్లు రేసులో ఉన్నాయి. జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వంటి వారు ఆశలు పెట్టుకున్నారు. దీంతో, ఈ లిస్టులో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది