E-PAPER

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం బాదల్ పై కాల్పులు..

పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. ఆలయ కాపలాదారుడిగా సేవ చేస్తున్న బాదల్ సమీపంలోకి నడుచుకుంటూ వచ్చిన ఓ వృద్ధుడు సడెన్ గా తుపాకీ తీసి కాల్పులకు ప్రయత్నించాడు. వృద్ధుడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమైన బాదల్ అనుచరుడు ఎదురు వెళ్లి అడ్డుకున్నాడు. ఇంతలో తుపాకీ పేలింది. అయితే, బుల్లెట్ ఎవరికీ తాకలేదు. వృద్ధుడి నుంచి తుపాకీని బలవంతంగా స్వాధీనం చేసుకున్న బాదల్ అనుచరులు.. ఆ వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. బాదల్ కు అత్యంత సమీపానికి వచ్చి కాల్పులు జరపగా.. బాదల్ కు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

అసలేం జరిగిందంటే..

పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పులు చేశారంటూ అకాల్ తక్త్ నిర్ధారించింది. పార్టీ చీఫ్ గా బాదల్ ను తప్పించడంతో పాటు స్వర్ణదేవాలయంలో సేవాదార్ (కాపలాదారు) గా, సేవకుడిగా పనిచేయాలని శిక్ష విధించింది. ఈ ఆదేశాలతో మంగళవారం సుఖ్ బీర్ సింగ్ శిక్ష అనుభవించారు. కాలు ప్రాక్చర్ అయినప్పటికీ చక్రాల కుర్చీలోనే ఉదయం ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని కిచెన్ లో పాత్రలు శుభ్రం చేశారు. టాయిలెట్లు కడిగారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసిన పలకను మెడలో వేసుకుని ఆలయ ద్వారం వద్ద కాపలాదారు విధులు నిర్వహించారు.

 

ద్వారం వద్ద బాదల్ చక్రాల కుర్చీలో కూర్చుని చేతిలో బల్లెం పట్టుకుని ఉండగా ఓ వృద్ధుడు ఆయన సమీపంలోకి వచ్చాడు. తన దుస్తుల్లో దాచిన తుపాకీని తీస్తుండగా బాదల్ అనుచరుడు గమనించి ఎదురువెళ్లాడు. వృద్ధుడి చేతులను గట్టిగా పట్టుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇంతలో తుపాకీ పేలింది. అయితే, బుల్లెట్ మాత్రం ఎవరికీ తాకలేదు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న మిగతా అనుచరులు వచ్చి తుపాకీ లాక్కుని వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడిని నారైన్‌ సింగ్‌ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేశాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram