E-PAPER

రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ షాకింగ్ ప్రకటన..!

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి ఏడాదిన్నర కిందటే బ్రేక్ పడింది. అప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు క్రమంగా తెరమరుగు అవుతోంది. వీటిపై ఎలాంటి లావాదేవీలు కూడా జరగట్లేదు. పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ క్రయవిక్రయాలు నమోదు కావట్లేదు.

 

గత ఏడాది మే 19వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆరంభించింది రిజర్వ్ బ్యాంక్. చలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది. ఆ తరువాత దీన్ని అదే ఏడాది అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.

 

చలామణిని ఉపసంహరించుకున్న క్రమంలో ఇప్పటివరకు 98.08 శాతం మేర పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2,000 నోట్ల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవని, అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది.

 

గత ఏడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్‌లో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు వివరించింది.

 

ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చలామణి సంఖ్య 8,470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8,470 కోట్ల రూపాయల విలువ చేసే 2,000 నోట్లు మార్కెట్‌లో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది.

 

ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ నాటికి 98.08 శాతం మేర నోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 1.92 శాతం మేర నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. వీటి విలువ 6,839 కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రస్తుతం చలామణిలో ఉన్నట్లు గుర్తిస్తోన్నట్లు పేర్కొంది. వాటిని మార్పిడి చేసుకోవడానికి ఎలాంటి డెడ్ లైన్లూ పెట్టలేదు రిజర్వ్ బ్యాంక్.

Facebook
WhatsApp
Twitter
Telegram