తెలంగాణ వ్యాప్తంగా పది రోజులలో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంపై సీఎం రేవంత్ సర్కార్ సీరియస్ గా పరిగణించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏదైనా సమస్య ఉంటే తన ఆఫీసు మొబైల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
మొన్న గురుకులాల్లో జరిగిన వరుస ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఆహారం విషతుల్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా గురకులాలను ఎమ్మేల్యేలు, అధికారులు ఉరుకులు, పరుగులతో సందర్శించి అక్కడి భోజనాన్ని వారు సైతం రుచి చూశారు.
అయితే సన్న బియ్యం అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కాగా ఇటీవల ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు వెలుగులోకి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆత్మహత్యలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
దీనితో మంత్రి ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మొన్న నారాయణ కాలేజీకి చెందిన బానోత్ తనూష్ నాయక్, నిన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీ విద్యార్ధి కౌషిక్ రాఘవ, నేడు ప్రగతినగర్ లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీ విద్యార్ధిని ప్రగ్నారెడ్డి మృతి బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి అన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేస్తే, అటువంటి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసేలా ప్రవర్తించవద్దని సూచించారు. బలవంతంగా సిలబస్ ను రుద్ది వారి జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కార్పోరేట్ కాలేజీల్లో చదివే విద్యార్ధులకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. మా కార్యాలయం దృష్టికి తీసుకురండి.. మేం మీకు అండగా ఉంటాం. మీ ఇబ్బందులను పరిష్కరిస్తాం. మీ కోసం ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురుచూస్తుందని మంత్రి అన్నారు.
విద్యార్థులు కూడా అధైర్య పడి చనికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మీపై ఎన్నో కలలు కంటున్నా తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని మంత్రి కోరారు. విద్యార్థులకు ఏదైనా అత్యవసర సమస్య ఉంటే తన ఆఫీస్ మొబైల్ నెంబర్ 8688007954 నెంబర్ కు గాని, minister.randbc@gmail.com జీ మెయిల్ కు తమ సమస్యను తెలపాలని సూచించారు. సమస్యకు ఆత్మహత్య అంతిమ పరిష్కారం కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించి, బ్రతుకుతూ సాధించాలన్న లక్ష్యంతో సమాజంలో రాణించాలని మంత్రి పిలుపునిచ్చారు.