రోజుల తరబడి బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్ర విచారకరమని పేర్కొంది. పౌర సమాజం దీన్ని హర్షించట్లేదని తెలిపింది.
షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి. హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు.
మహ్మద్ యూసుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా భావిస్తోన్నారు. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలన్నింటిపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేయాలని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేసింది. సాధారణ పరిస్థితులు, శాంతియుత వాతావరణం నెలకొనేలా ఇస్లామిక్ గ్రూప్‌లతో చర్చించాలని కోరింది.
ఈ మేరకు ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె ఓ ప్రకనట విడుదల చేశారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలనీ డిమాండ్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, హిందువులపై దాడులు తీవ్ర అభ్యంతరకమని అన్నారు.
బంగ్లాదేశ్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను జైలు నుంచి విడిపించడం, హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను అరికట్టడానికి అంతర్జాతీయ సమాజం నుంచి బంగ్లాదేశ్‌పై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారు.