రాష్ట్రంలో మ్యానిఫెస్టో హామీల అమలు కనిపించడం లేదు కానీ మాఫియా ముఠాలు, వారి మధ్య డబ్బుల పంపకాలు మాత్రమే కనిపిస్తున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వానికి ముందు ఇవన్నీ సాధ్యమేనా అనుకున్న ఎన్నో విషయాల్ని తాము అమలు చేసి చూపించామని జగన్ గుర్తుచేశారు. విద్యారంగంలో చేపట్టిన పలు మార్పులే ఇందుకు నిదర్శనం అన్నారు. అందులో అమ్మఒడి, నాడు-నేడు, టోఫెల్ శిక్షణ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు.
వైద్య రంగంలోనూ ఎన్నో సంస్కరణల్ని తాము అమలు చేశామన్నారు.
సంపద సృష్టి అని ప్రభుత్వం చెప్పుకుంటోందని, కానీ వైసీపీ హయాంలో అసలు సంపద సృష్టి జరిగిందన్నారు. ప్రభుత్వ రంగంలో మూడు పోర్టుల నిర్మాణమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇలా పోర్టులు, మెడికల్ కాలేజీలతో సంపద సృష్టికి ప్రయత్నించినట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి డిస్కమ్ ల అప్పులు, నష్టాలు 86 వేల కోట్లకు చేరాయన్నారు. చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్ధితి దయనీయంగా ఉండేదన్నారు. వాటిని నిలబెట్టే క్రమంలో డిస్కంలపై ఆధారపడకుండా రైతులకు ఊరట కల్పించేందుకు సోలార్ ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు.
రాష్ట్రంలో సోలార్ పార్కులపై తాము చేస్తున్న ప్రయత్నాలపై కోర్టుల్లో కేసులు పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ
కిలోవాట్ కు రూ.2.49 చొప్పున సౌర విద్యుత్ సరఫరాకు ప్రతిపాదనలు పంపిందన్నారు. ఇందుకోసం సెకీ పలు రాయితీలు కూడా ఇచ్చిందన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి లేరన్నారు. అలాగే రూ.2.49 పైసలకు కిలోవాట్ విద్యుత్ రావడం ఏపీ చరిత్రలోనే ఇది తొలిసారన్నారు. ఈ ప్రాజెక్టుకు మాత్రమే అంతర్ రాష్ట్ర ట్రాన్సిమిషన్ ఛార్జీల్ని కేంద్రం మినహాయింపు ఇచ్చిందన్నారు.
గతంలో చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కిలోవాట్ ను సగటున రూ.5.90 కు కొన్నారని, తాను రూ.2.49 కి ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెడుతున్నారన్నారు. అంత రేట్లకు ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు మంచోడా, సగం రేటుకు దొరుకుతున్న విద్యుత్ ఒప్పందం చేసుకున్న తాను మంచోడినా చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన సెకీ ఒప్పందానికి అప్పటి కేంద్ర విద్యుత్ శాఖ, కేంద్ర ఈఆర్సీ ఆమోదం కూడా ఉందన్నారు. ఈ ఒప్పందంతో 25 ఏళ్లలో లక్షా 10 వేల కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతాయన్నారు.
గుజరాత్ లో 1.99కే కిలోవాట్ సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంటే వైసీపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా తీసుకున్నారని అడుగుతున్నారని, కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఆ విద్యుత్ తెచ్చుకుంటే ట్రాన్స్ మిషన్ ఛార్జీలు మరో 2 రూపాయలు కలుస్తాయన్నారు. అమెరికా కోర్టులోనూ తన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని, అయినా తన పేరుతో ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇది కేవలం రెండు ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమేనన్నారు. తన ఐదేళ్ల పాలనలో గౌతం అదానీ చాలా సార్లు కలిశారని, కానీ దీని కోసం మాత్రం కాదన్నారు. అప్పటికే ఏపీలో అమల్లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాత్రమే ఆయన తనను కలిశారన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు పంపుతానన్నారు.