ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొత్తగా పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 1,435 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని అమలులోకి తీసుకుని రాబోతోంది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం- ఈ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ కొత్త పాన్ కార్డ్ వ్యవస్థను తెర మీదికి తీసుకొచ్చింది.
దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తుల క్రయ విక్రయాల వ్యవహారాల్లో పాన్ కార్డ్ అత్యవసరమైన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ కింద 1972లో తొలిసారిగా ఇది అమలులోకి వచ్చింది.
డిజిటల్ ఇండియా, ఇ-గవర్నెన్స్‌లో భాగంగా దీన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. పర్మినెంట్ అకౌంట్ నంబర్‌గా కొనసాగించడంతో పాటు కామన్ బిజినెస్ ఐడెంటిఫయర్గా ఈ కార్డును తీర్చిదిద్దనుంది. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియను మరింత సరళతరం చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే పాన్ కార్డ్.. క్యూఆర్ కోడ్ ఫీచర్‌తో పని చేస్తుంది. పన్ను చెల్లింపులు మొదలుకుని ఇతర ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం, బ్యాంకింగ్ యాక్సెస్‌ను సరళీకరించడం, పాన్ కార్డ్‌పై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తుదారుడికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో సేకరించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
దేశంలో ఈ వ్యవస్థ అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు దాదాపు 78 కోట్లకు పైగా పాన్ కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాన్ కార్డులను కొనసాగిస్తూనే వినియోగదారులు వాటిని అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించనక్కర్లేదు. కొత్తగా కేవైసీని ఇవ్వడం, ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా అప్‌గ్రేడ్ చేయించుకోవచ్చు.