E-PAPER

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రస్తావన..!

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీ నదీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దేశ పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెలిసింది. రాజ్యసభలో చర్య సందర్భంగా ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాగా ఆయా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని కేంద్ర మంత్రి టోకెన్ సాహు సభలో వెల్లడించారు.

 

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాగా.. రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ నదిని కాపాడేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రభుత్వ చర్యలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారంటూ బీఆర్ఎస్ ఎంపీ ఆర్కే సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాతపూర్వ సమాధాన ఇచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు.. మూసీ నదిని తిరిగి జీవనదిగా, స్వచ్ఛమైన నదిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెల్లడించారు.

 

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలు అవసరమైన మేరకే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణాల దృష్ట్యా నదీ పరిహార ప్రాంతాల్లోని నిర్మాణాల్లో ఉండే ప్రజలకు అక్కడి నుంచి తరలిస్తామని తెలిపింది. అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు పునర్నిర్మాణంలో భాగంగా అవసరం లేకున్నా భూసేకరణ చేపట్టమని స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయే బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల మేరకే భూసేకరణ చేపడతామని కేంద్రానికి తెలిపినట్లు.. కేంద్ర మంత్రి రాజ్యసభలో వెల్లడించారు.

 

వాస్తవానికి నదీ గర్భంలో ఉండేందుకు ఎలాంటి అనుమతులు ఉండవని, అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఆయా నివాసితల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని తెలిపింది. అందుకే.. మూసీ నదీ గర్భం, బఫర్ జోన్ల నుంచి తరలించే వారి కోసం.. సమీప ప్రాంతాల్లోనే 15 వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. వాళ్లందరికీ ఇళ్ల కేటాయింపులు చేపడతామని, ఎవరికీ ఆపద రాకుండా చూసుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబాల కోసం, వారి జీవన ప్రమాణాలకు మద్దతుగా నిలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం.. ప్రత్యేకంగా ఒక కమిటీని సైతం నియమించినట్లు పార్లమెంట్ కు తెలిపింది.

 

హైదరాబాద్ నగరం నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని తిరిగి జీవనదిగా, స్వచ్ఛమైనదిగా మార్చడంతో పాటు కాలుష్య నివారణ, వరదల బారి నుంచి కాపాడేందుకు ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అనేక విషయాలపై చర్చలు జరుగుతున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే వాటి గురించిన వివరాల్ని అందరికీ తెలుపుతామని ప్రకటించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram