కాళేశ్వరం కన్నా అతిపెద్ద కుంభకోణం హరితహారంలో జరిగిందని బీఆర్ఎస్ మాజీ కార్యకర్త గుండమల్ల రాజేంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇది పదివేలు, లక్ష కోట్ల స్కామ్ కాదని అంతకంటే పెద్ద స్కామ్ అని ఆరోపించారు. 234 కోట్ల మొక్కలు నాటడం అనేది అసాధ్యం అని, రోబోలు కూడా ఆ పనిచేయలేవని చెప్పారు. ఒక్కో మొక్క కోసం దాదాపు రూ.50 రూపాయలు ఖర్చు అవుతుందని, దాని పెంపకం కోసం మెయింటెనెన్స్ రూ.3 వేలు ఖర్చు అవుతుందని అన్నారు. ఇది ఒక స్కామ్ అని కూడా ఎవరూ ఊహించరని చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్ లు చాలా స్మార్ట్ స్కామర్లు అని ఆరోపించారు. హరితహారం స్కామ్ ను ఎవరూ బయటపెట్టలేరని చెప్పారు. 234 కోట్ల మొక్కలు చూపించమంటే వరదలు వచ్చాయి… మొక్కలను పట్టించుకోలేదు అనే కారణాలు చూపించుకోవచ్చని అన్నారు. కానీ ఇప్పటికే ఆ పథకానికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకంలోనూ స్కామ్ చేశారని అన్నారు. పార్టీకి చెందిన జగన్ రావు సోదరుడు బెంగుళూరులో యాక్సిడెంట్ కు గురై అక్కడే ఆస్పత్రిలో చనిపోయాడని అన్నారు.
అక్కడ చనిపోతే ఇక్కడే చనిపోయినట్టు సృష్టించి రూ.15 లక్షలు తీసుకున్నారని చెప్పారు. దీనిపై ఆర్టీఐ పెడితే ఇప్పటి వరకు తనకు సమాధానం రాలేదన్నారు. సీఎంఆర్ఎఫ్, హరితహారం, ఉద్యోగాలలోనూ స్కామ్ జరిగిందని అన్నారు. మిషన్ భగీరతలోనూ భారీ స్కామ్ జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అన్నీ స్కాములే జరిగాయని షాకింగ్ కామెంట్ల చేశారు. స్కామ్ ల గురించి మాట్లాడినందుకే తనను టార్చర్ చేశారని చెప్పారు.
ఆ సమయంలో తనకు ప్రతిపక్ష నేతలు అండగా నిలిచారని అన్నారు. పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులే కాపాడారని చెప్పారు. ఇంట్లో వెనక గదిలో పడుకుని ముందు రెండు డోర్లకు తాళం వేసుకుని పడుకునేవాళ్లమని, అంతలా భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. రాత్రుళ్లు భయంతో నిద్రపట్టేది కాదని, తనను చంపే ప్రయత్నాలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల పాటూ పార్టీ కోసం పనిచేశానని చివరికి ప్రభుత్వం తీరు చూసి విసిగి పోయానని అన్నారు.