రాష్ట్రంలోని రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు ధాన్యం కోనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. సూర్యాపేట పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు 50,40 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.2.760 కోట్ల డబ్బు చెల్లించాలని చెప్పారు. కాళేశ్వరం నుండి నీరు రాకపోయినా 66 లక్షల ఎకరాలలో 153 లక్షల ఎంటీ ధాన్యం ఉత్పత్తి అయ్యిందని తెలిపారు. అంతే కాకుండా ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని శుభవార్త చెప్పారు.
సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న భూములకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామని వివరించారు. హుజూర్ నగర్, తుంగతుర్తి, కోదాడలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో పేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఒక్కో పాఠశాల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన తరవాత తమ ప్రభుత్వం 48 గంటల నుండే అభివృద్ధిపై దృష్టి పెట్టిందని వివరించారు.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నుండి పథకాలను ప్రారంభించినట్టు తెలిపారు. అదే విధంగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం దేశంలోనే చరిత్ర సృష్టించిందని అన్నారు. జనవరి నెల చివరి వరకు రూ.2 లక్షల వరకు ఉండి మాఫీ అవ్వని రైతులకు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు జారీ చేస్తామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని చెప్పారు.
మూసీ ప్రక్షాళన ద్వారా ఉమ్మడి జిల్లాలో ఆయకట్టు ప్రాంతం పెరుగుతుందని, జిల్లాలో సురక్షితమైన తాగునీరు దొరుకుందని అన్నారు. త్వరలోనే హుజూర్ నగర్, కోదాడలకు రైల్వే లైన్ లు వస్తాయని ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖను బ్రష్టుపట్టించిందని, లక్షా ఎనభైవేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరా కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేకపోయిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టుది కూడా అదే పరిస్థితి అని ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు కానీ ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదని విమర్శలు కురిపించారు.
కానీ తమ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని, ఏమైనా మరమత్తులు ఉన్నా వెంటనే చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్, కోదాడలో లిఫ్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూంలతోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, డిసెంబర్ 7 నుండే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్దరించబడిందని చెప్పారు.