బీఆర్ఎస్ లో కులవివక్ష ఉందని ఆ పార్టీ మాజీ కార్యకర్త గుండమల్ల రాజేంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ ఇంటర్వ్యూలో రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ… పంతొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నానని చెప్పారు. బీఆర్ఎస్ లో వందకు వందశాతం కుల వివక్ష ఉందని అన్నారు. పార్టీలో ఓ నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పట్టుకుని వాడేంటి? వాడి స్థాయి ఏంటి అని అవమానించారని చెప్పారు. 2023 వరకు కులం ఆధారంగానే రాజకీయాలు చేశారని అన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు కొంగర్ కలాన్ లో ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేశారని అన్నారు. ఆ సభకు వెళుతుండగా దళిత ముఖ్యమంత్రి టాపిక్ రావడంతో కొప్పుల ఈశ్వర్ ను ఓ ఆరునెలలు ముఖ్యమంత్రిని చేయాలని తాను సూచించినట్టు చెప్పారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ ఛైర్మెన్ జగన్ రావు వెంటనే అగ్నిగుండం బద్దలైనట్టు.. వాడితో సార్ ను పోలుస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. వాడి స్థాయి ఏంటి సార్ స్థాయి ఏంటి అని మాట్లాడరని చెప్పారు.
కేసీఆర్ 2014లో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశాడని అన్నారు. కులగర్వం, అహంకారంతో కేటీఆర్ సన్నిహితుడు పాటిమీది జగన్ రావు రెచ్చిపోయేవారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు జగన్ రావు, నవీన్ రావు నుండి బెదిరింపులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు కూడా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ప్రతిరోజు ఆయన వెంట వెళ్లాలని, ఆయన వెంట జనాలు కనిపించాలని అన్నారు. పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లాలని చెప్పారు. తాను వెళ్లకపోవడంతో కుటుంబాన్ని బెదింరించారని అన్నారు.
రాత్రి పదకొండు గంటలకు తమ ఇంటికి మనుషులును పంపించేవారని బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. మీ కొడుకును చంపేస్తామంటూ తన తల్లిని బెదింరిచారని అన్నారు. తనకు జరిగిన నష్టంపై కేసులు పెట్టడంతో పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరించారని అన్నారు. మహిళతో లైంగిక వేధింపుల కేసు పెట్టిస్తామని కూడా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో తనను తిట్టడంతో వారి వేధింపులు తట్టుకోలేకపోయానని చెప్పారు. ఆ తరవాతనే వాళ్లకు శిక్ష పడాలని పోరాడినట్టు తెలిపారు. ఆ తరవాత పోలీసులు వచ్చి తనను ఇంటినుండి తీసుకెళ్లారని అన్నారు.