మహారాష్ట్ర, జార్ఖండ్ లో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకే విడతలో.. జార్ఖండ్ లో రెండో విడత పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో తొలి విడత ఎన్నికల సరళి రెండు కూటములు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికలు.. మారుతున్న సమీకరణాల వేళ ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు ప్రధానంగా ఉన్న రెండు కూటములకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. నేడు చివరి రోజు ప్రచారంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
నేటితో ప్రచారం ముగింపు
హోరా హోరీగా సాగుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. జార్ఖండ్ లో మిగిలిన 38 స్థానాలకు నేటితో ప్రచారం పూర్తవుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో ఓటర్ మూడ్ పైన తొలి విడత ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఒక అంచనా ఏర్పడింది. దీంతో, రెండో విడతలో ఓటర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు చివరి రోజు ప్రచారం కావటంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
జార్ఖండ్ లో విజేత ఎవరో తేలిపోయిందా..!!
హోరా హోరీ
ఇక, మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోరు హోరా హోరీగా మారింది. ముంబాయి నగరం లోనూ ఈ సారి గట్టి పోటీ కనిపిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 234 జనరల్ కాగా, 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు కాగా, 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక, 1.85 కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవనున్నారు. వారిలో 20.93 లక్షల మంది తొలిసారిగా ఓటు వేస్తున్న వారు ఉన్నారు. మహాయుతి, ఎంవీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో ప్రధానంగా యువత, మహిళల ఓట్ల కోసం హామీలు గుప్పించారు. అదే విధంగా ఈ సారి మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి.
ప్రతిష్ఠాత్మకం
బీజేపీ ప్రధాన పార్టీగా శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు కలిసి మహాయుతిగా బరిలోకి దిగాయి. ఈ కూటమికి ధీటుగా శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్ పవార్) పార్టీలతో కలిసి కాంగ్రెస్ మహా వికాస్ అఘాడి గా ధీటుగా పోటీ చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఈ కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. దీంతో.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహాయుతి కూటమి పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందనే ఆశతో కనిపిస్తోంది. రెండు కూటముల నుంచి ముఖ్య నేతలు చేసిన ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసారు. ఇక, ఈ రోజు చివరి రోజు ప్రచారంలో ఫలితం డిసైడ్ చేసే ఆసక్తి కర అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఫలితాలే జమిలి నిర్ణయానికి కీలకంగా మారనుండటంతో.. దేశం మొత్తం చూపు ఈ రెండు రాష్ట్రాల వైపే ఉంది.