తెలంగాణలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతోన్నాయి. సోమవారంతో పరీక్షలు ముగుస్తాయి. 1,380 గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ రాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-3 పరీక్షలు నవంబర్ నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మూడు పేపర్లుగా పరీక్ష ఉండగా.. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్ పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ నిర్వహించారు.
రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మూడో పేపర్ నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. మొత్తం 450 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలు ఉండగా.. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. కాగా పేపర్ వన్ లో సినిమాలకు సంబంధించి ప్రశ్నలు వచ్చాయి. 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది అని ఒక ప్రశ్న వచ్చింది.
దీనికి ఆప్షన్ ఏగా బ్రహ్మాస్త్ర, ఆప్షన్ బీగా కాంతార, ఆప్షన్ సీగా ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్, ఆప్షన్ డీగా ఆట్టం ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం ఆట్టం. ఈ సినిమా 2024లో విడుదల అయింది. దీంతో పాటు మరొక ప్రశ్న కూడా సినిమాకు సంబంధించి ఉంది. ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఎ టైగర్ దర్శకుడు ఎవరు అని ప్రశ్న వచ్చింది. ఇందులో ఆప్షన్ ఏగా కార్తికి గొన్సాల్వ్స్, ఆప్షన్ బీగా నిషా పహుజా, ఆప్షన్ సీగా ఆర్. మహదేవన్, ఆప్షన్ డీగా నిఖిల్ మహాజన్ ఇచ్చారు.
ఈ ప్రశ్నకు సమాధానం నిషా పహుజా. కాగా టీజీపీఎస్సీ ఇప్పటికే విజయవంతంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలో గ్రూప్-2 పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నారు.