E-PAPER

మీ కోసం సుప్రీం కోర్టు వరకైనా వెళతాం.. లగచర్ల నిందితులకు కేటీఆర్ భరోసా..

లగచర్ల దాడి ఘటనతో సంబంధం లేని వాళ్లను జైలుకు పంపించారని, వాళ్లపై పోలీసులు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. దాడి కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదులుగా ఉన్న వారిని కేటీఆర్, ఇతర సీనిరయ్ బీఆర్ఎస్ నాయకులు ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్.. తమ నాయకుడు కేసీఆర్ ఆదేశాలతోనే జైల్లో ఉన్న వారిని కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. అక్కడి వారి బాధలు వింటే బాధగా ఉందని, వారంతా నిర్దోషులంటూ వ్యాఖ్యానించారు.

 

ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఒకప్పుడు అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు ఫార్మా సంస్థలకు మద్ధతిస్తున్నారంటూ ప్రశ్నించారు. లగచర్లలో లక్షలు విలువ చేసే భూములను తీసుకుని.. కొద్దికొప్పా ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇలా భూములు కొల్లగొడుతోందంటూ ఆరోపించారు. మార్కెట్లో ఈ భూముల ధరలు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉన్నాయన్న మాజీ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం మాత్రం రూ.10 లక్షలు ఇస్తామంటే ఎలా అని అడిగారు.

 

ప్రస్తుతం జైలులో రిమాండ్ లో ఉన్న వాళ్లంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అని ఒప్పుకున్న కేటీఆర్.. వాళ్లను అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. దాడి సమయంలో ఎక్కువగా కాంగ్రెస్ నాయకులే ఉన్నారని, వారిని తప్పించి.. బీఆర్ఎస్ కార్యకర్తల్ని నిందితులుగా చేర్చారని అన్నారు. దాడి తర్వాత పోలీసులు 60, 70 మందిని అరెస్టు చేశారని.. వారు ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారన్న కేటీఆర్.. దాడితో సంబంధం లేని అమాయక బీఆర్ఎస్ పార్టీ వాళ్లను గుర్తించి కేసులు బనాయించారని తెలిపారు.

 

పోలీసుల అదుపులోకి తీసుకున్న 21 మందిలో అంతా పేదవాళ్లే అన్న కేటీఆర్.. వాళ్లను పోలీసులు చిత్రహింసలు పెట్టారని, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్లీ కొడతామంటూ ఆమానవయంగా వ్యవహరించారంటూ పోలీసులపై ఆరోపణలు చేశారు. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని, ఆయన కులగణన కోసం ఆ ఊరు వెళితే.. దాడుల్లో పాల్గొన్నాడంటూ కేసు బనాయించారని, మరొక వ్యక్తి వనపర్తిలో చదువుకుంటూ.. గొడవ విషయం తెలిసి ఇంటికి వస్తే అతనిపైనా కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు. వారెవరూ భయపడవద్దని సూచించిన కేటీఆర్.. జైల్లో ఉన్నావారికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. వారి కోసం అవసరమైతే.. సుప్రీం కోర్టు వరకు వెళతామని అన్నారు.

 

పదవులు శాశ్వతం కాదని, ఈ రోజు కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే.. రేపు తాము అధికారంలోకి వస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టుకో.. మేము అధికారంలోకి వచ్చాక నిన్నేం చేయాలో అది చేస్తాం అంటూ సీఎం ను ఉద్దేశించి అన్నారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram